ఆకతాయిల క్రూరత్వానికి గర్భంతో ఉన్న ఏనుగు మృతి.!

కేరళ మలప్పురం దగ్గర్లోని ఓ గ్రామంలో కొందరు ఆకతాయిలు అత్యంత క్రూరమైన చర్యకు పాల్పడ్డారు. మానవత్వం మరిచిపోయి గర్భంతో ఉన్న ఓ ఏనుగు చావుకు కారణమయ్యారు. ఆకలితో ఉన్న ఓ జంతువుకు ఆహారం ఆశచూపి.. దాని ప్రాణాలు తీశారు. మాన వత్వాన్ని మంటగల్పిన ఈ ఘటన గత నెలలో కేరళలో చోటు చేసుకొంది. గర్భంతో ఉన్న ఓ ఏనుగుతో సైలెంట్‌ వ్యాలీ వద్ద ఓ గ్రామంలోని ప్రజలు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. నది పాయల్లో ఆహారం వెతు క్కుంటూ ఓ ఆడ ఏనుగు గ్రామంలోకి వచ్చింది. కొందరు స్థానికులు దానికి ఒక పైనాపిల్‌ ఆశ చూపారు. ఆ పైనాపిల్‌లో పేలుడు పదార్థాలు పెట్టారు. ఇది ఏమాత్రం తెలియని గజరాజు తినేసింది. దీంతో ఆ పండు భారీ చప్పుడుతో పేలింది.ఆకతాయిల క్రూరత్వానికి గర్భంతో ఉన్న ఏనుగు మృతి.!ఆ మూగజీవి నోటివెంట రక్తం ధారగా కారింది. రక్తమోడుతున్న నోటితో గ్రామం వదిలి వెళ్లిపోయింది. ఓ పక్క కడుపులో పెరుగుతున్న బిడ్డ ఉండటంతో ఆకలి.. మరోపక్క నరాలను మెలిపెట్టే బాధ.. దీనికి తోడు గాయంపై ఈగలు వాలుతుండటంతో.. ఏమి చేయాలో తెలియక ఆ మూగజీవం వెల్లియార్‌ నదిలోకి దిగి గొంతు తడుపుకొంది. విషయం తెలుసుకొన్న అటవీశాఖ సిబ్బంది.. సురేందర్‌, నీలకంఠన్‌ అనే మరో రెండు ఏనుగులను తీసుకొచ్చి దానిని బయటకు రప్పించేందుకు ప్రయ త్నించారు. కానీ, గాయం బాధను తట్టుకోలేక పోతున్న ఆ ఏనుగు అక్కడే ఉండి పోయింది. చివరికి మే 27వ తేదీ సాయంత్రం 4గంటలకు తుదిశ్వాస విడిచింది. కేవలం పోకిరీలు చేసిన వెధవ పనికి నిండు గర్భంతో ఉన్న ఆ ఏనుగు ప్రాణాలు వదిలింది. హృదయ విదారకమైన ఈ ఘటనను మల్లప్పురం అటవీశాఖ అధికారి మోహన్‌ కృష్ణన్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలో వెల్లడించారు. చనిపోయిన ఏనుగును బయటకు తీసుకొచ్చి దానిని పరీక్షించగా అది గర్భంతో ఉందని వైద్యులు తెలిపారు. చివరికి అటవీశాఖ సిబ్బంది దానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ చర్యకు పాల్పడ్డవారి పై ఇప్పుడు కేసు నమోదు చేశారు.