షాహిదా బేగం హత్య కేసులో ఐదుగురు అరెస్టు

షాహిదా బేగం హత్య కేసులో ఐదుగురు అరెస్టుఆంధ్రప్రదేశ్: కళ్యాణదుర్గం మండలం చాపిరి గ్రామానికి చెందిన షాహిదా బేగం అలియాస్ షాహిదమ్మ (19) హత్య కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేశామని కళ్యాణదుర్గం డీఎస్పీ ఎన్ రమ్య పేర్కొన్నారు. కనేకల్లు మండలం తుంబిగనూరు సమీపంలోని హెచ్చెల్సీ కాలువలో షాహిదా బేగం 24న శవమై తేలిన విషయం తెలిసిందే. ఈనెల 17 వ తేది రాత్రి నుండి షాహిదాబేగం కన్పించుటలేదని కళ్యాణదుర్గం రూరల్ పోలీసు స్టేషన్లో ఆ అమ్మాయి తల్లి దూదేకుల సతాన్భీ ఈనెల 19 రాత్రి 7 గంటలకు ఫిర్యాదు చేశారన్నారు. వెంటనే మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా..ఈ హత్యతో సంబంధమున్న చాపిరి గ్రామానికి బి.రఘు, ఇతని చిన్నాన్నలు రాజప్ప , ఆనంద్ , పిన్నమ్మ విశాలమ్మ, అమ్మ లింగమ్మలను అరెస్టు చేశామన్నారు. ఈ ఐదుగురిలో ప్రధాన నిందితుడైన బి.రఘు ఈనెల 17 న షాహిదా బేగంను పెళ్లి చేసుకుంటానని నమ్మించి కనేకల్లు మండలం మాల్యం వద్దకు తీసికెళ్లాడన్నారు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుని మాల్యం సమీపంలోని హెచ్చెల్సీ కాలువలోకి షాహిదా బేగంను తోశాడన్నారు. చాపిరి షాహిదా బేగం హత్య కేసులో ప్రధాన నిందితుడైన బి.రఘుపై రౌడీషీట్ ఓపెన్ చేశామని డీఎస్పీ ఎన్ రమ్య తెలిపారు. అమ్మాయిలు, మహిళలపై నేరాలకు ఒడిగడితే ఉపేక్షించబోమని హెచ్చరించారు.