పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్ఎస్ కు షాక్

పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్ఎస్ కు షాక్

హైదరాబాద్ : దుబ్బాక ఉపఎన్నికల ఫలితం పుణ్యమా అని టీఆర్ఎస్ ప్రభుత్వం జీహెచ్ఎంసీ ఎన్నికలను త్వరితగతిన పూర్తిచేయాలని చేసిన కసరత్తులో అన్ని రాజకీయపార్టీలు నువ్వానేనా అన్నట్లుగా గ్రేటర్ ఎన్నికల ప్రచారం కొనసాగించాయి. అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చేందుకు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీల సీనియర్ నాయకులు తమ అభ్యర్ధుల గెలుపుకోసం తీవ్రంగా ప్రచార హోరు నిర్వహించారు.చివరగా గ్రేటర్ ఎన్నికలు 150 డివిజన్లలో పూర్తయ్యాయి. పోలింగ్ లో సైతం అటు గ్రేటర్ హైదరాబాద్ ఓటర్ల బద్దకం స్పష్టంగా కనిపించింది. గతంతో పోల్చితే ఓటింగ్ శాతం సైతం తగ్గింది.

ఇదిలా వుంటే నేడు కొనసాగుతున్న ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ గట్టి పోటీనే ఇస్తుంది. 150 డివిజన్లలో టీఆర్ఎస్ 16, బీజేపీ 43 స్థానాల్లో అధిక్యతలో ఉన్నట్లుగా చెబుతున్నారు. దీంతో టీఆర్ఎస్ పార్టీలో గందరగోళం నెలకొంది. తుది ఫలితాలు ఎలా వుంటాయోనని ఆందోళన పడుతున్నారు. ఇదంతా మొత్తం పోస్టల్ బ్యాలెట్ లో నమోదైన ఓట్లు మాత్రమేనని మరిచిపోకూడదు. పోస్టల్ బ్యాలెట్ లో ప్రభుత్వ ఉద్యోగులు, వయసు మీద పడినవారు, కోవిడ్ పేషంట్లతో పాటు, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వున్న వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ వేశారన్న విషయం తెలిసిందే. ప్రభుత్వం ఉద్యోగులు కేసీఆర్ సర్కారు మీద వ్యతిరేకతతో ఉన్నారన్న విషయం తెలిసిందే. పోస్టల్ బ్యాలెట్ల ఫలితం ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. అయితే ఎన్నికల విజయంలో కీలకమైన ప్రజలు ఓట్లు పోస్టల్ బ్యాలెట్ లోకి రావన్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం జరుగుతున్న కౌంటింగ్ రౌండ్ రౌండ్ కు మారే అవకాశం వుంది.