పేద అక్కచెల్లెమ్మలకు ప్రభుత్వ సహకారం

ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పంపిణీకి చర్యలు
గుడివాడ నియోజకవర్గానికి 2,069 యూనిట్లు మంజూరు
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిపేద అక్కచెల్లెమ్మలకు ప్రభుత్వ సహకారం

గుడివాడ : గ్రామాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలు వ్యాపారాలు చేసుకునేందుకు వైఎస్సార్​ చేయూత, ఆసరా పథకాలతో ప్రభుత్వం సహకారం అందిస్తోందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. ఇందులో భాగంగానే ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. సీఎం జగన్​ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రలో అక్క చెల్లెమ్మలకు మెరుగైన జీవనోపాధితో పాటు సుస్థిర ఆదాయమే లక్ష్యంగా పలు పథకాలను అమలు చేస్తానని హామీ ఇచ్చారన్నారు. గుడివాడ రూరల్ మండలానికి 393 యూనిట్ల గేదెలు, 80 యూనిట్ల ఆవులు, 90 యూనిట్ల గొర్రెలు, 76 యూనిట్ల మేకలు, అలాగే గుడ్లవల్లేరు మండలానికి 584 యూనిట్ల గేదెలు, 31 యూనిట్ల ఆవులు, 136 యూనిట్ల గొర్రెలు, 30 యూనిట్ల మేకలు, నందివాడ మండలానికి 454 యూనిట్ల గేదెలు, 39 యూనిట్లు ఆవులు,105 యూనిట్ల గొర్రెలు, 51 యూనిట్ల మేకలు మొత్తం 2,069 యూనిట్లు మంజూరయ్యాయని వీటిని లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. ఈ నెల 2 వ తేదీన ఆవులు, గేదెల పంపిణీ పథకాన్ని ప్రభుత్వంప్రారంభించిందని, రూ.3,500 కోట్ల వ్యయంతో 2,11,780 ఆవుల యూనిట్లు, 2,57,211 గేదెల యూనిట్లు మొత్తం 4.69 లక్షల యూనిట్లు ఆవులు, గేదెలను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. 2021 ఫిబ్రవరి నాటికి లక్ష యూనిట్లు, ఆ తర్వాత ఆగస్టు నుంచి 2022 ఫిబ్రవరి వరకు 3. 69 లక్షల యూనిట్లను పంపిణీ చేస్తామన్నారు. ఈ నెల 10 వ తేదీన సీఎం జగన్​ జగనన్న జీవక్రాంతి పథకాన్ని ప్రారంభించారన్నారు. రూ. 1,869 కోట్ల వ్యయంతో 1,51,671 గొర్రెల యూనిట్లు, 97,480 మేకల యూనిట్లు మొత్తం 2.49 లక్షల యూనిట్లను పంపిణీ చేస్తామన్నారు. ఒక్కో యూనిట్​లో ఐదారు నెలల వయస్సు ఉన్న 14 మేకలు లేదా గొర్రెలు, ఒకమేకపోతు లేదా పొట్టేలు ఉంటాయన్నారు. తొలి దశలో 2021 మార్చి నాటికి 20 వేల యూనిట్లు, రెండవ విడతలో ఏప్రిల్​ నుంచి ఆగస్టు వరకు 1.30 లక్షల యూనిట్లు, మూడవ విడతలో సెప్టెంబర్​ నుంచి డిసెంబర్ వరకు 99 వేల యూనిట్లను పంపిణీ చేస్తామన్నారు. లబ్ధిదారులకు చేయూత పథకంలో ఏటా రూ.18,750 లు చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ. 75 వేలను ప్రభుత్వం అందజేస్తుందన్నారు. యూనిట్ల కొనుగోలు, పంపిణీలో ఎటువంటి అవినీతి, అవకతవకలకు తావులేదన్నారు. పారదర్శకంగా చేపట్టేందుకు ప్రభుత్వం నిర్దిష్టమైన విధి విధానాలను రూపొందించిందని మంత్రి కొడాలి నాని తెలిపారు.