వినకుంటే బీజేపీకి నూకలు తినిపిచ్చుడే : దాస్యం
వరంగల్ టైమ్స్ , హనుమకొండ జిల్లా : యాసంగి వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా హనుమకొండ జిల్లాలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆధర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బాలసముద్రంలోని టీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంపై చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ నల్ల జెండా ఎగురవేసి నిరసన వ్యక్తం చేశారు. బాలసముద్రం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసి, కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. తెలంగాణ ప్రజలను నూకలు తినాలన్న బీజేపీ పార్టీ నాయకులకు తెలంగాణ రైతులు నూకలు తినిపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని దాస్యం వినయ్ భాస్కర్ హెచ్చరించారు. వరి కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరి మార్చుకునే దాకా ఉద్యమ నేత సీఎం కేసీఆర్ సారథ్యంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ధ్వజమెత్తారు. ఈ నెల 11న ఢిల్లీలో చేపట్టే దీక్షతో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి సెగ తగిలిస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం హెచ్చరించారు.