జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్

‘జగనన్నతోడు’ పథకం ప్రారంభం
అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాల వర్తింపు
‘వారి కష్టాలు స్వయంగా చూశాను’
పథకం ప్రారంభంలో సీఎం వైఎస్ జగన్

జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్

అమరావతి : చిరు వ్యాపారులు, సంప్రదాయ వృత్తిదార్లకు బ్యాంకుల ద్వారా రూ.10 వేల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. బుధవారం క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ‘జగనన్నతోడు’ పథకం ప్రారంభ కార్యక్రమంలో సీఎం మట్లాడారు. ఈ రోజు ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. 3648 కి.మీ పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలు స్వయంగా చూశానన్నారు. లక్షల సంఖ్యలో ఉన్న వారందరికి మంచి చేయాలని మనసారా కోరుకున్నట్లు తెలిపారు. దేవుడి దయ మీ చల్లని ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం చేసే అవకాశం కలిగిందన్నారు. ఈ సందర్భంగా ఫుట్‌పాత్‌ల మీద, వీధుల్లో తోపుడు బండ్ల పై వస్తువులు, కూరగాయలు, పండ్లు అమ్ముకుని జీవించే వారు,రోడ్ల పక్కన టిఫిన్‌ సెంటర్లు నిర్వహించేవారు, సంప్రదాయ చేతివృత్తుల కళాకారులు, ఇత్తడి పని చేసే వారు, బొబ్బిలివీణ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మల తయారీ, కలంకారీ, తోలుబొమ్మలు, కుమ్మరి తదితర వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి వడ్డీ లేకుండా బ్యాంకుల ద్వారా రూ.10 వేల వరకు రుణాలు అందుతాయన్నారు. ఈ పథకంలో తొలుత రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9.05 లక్షల లబ్ధిదారులకు రూ.905 కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఎం.శంకర్ నారాయణ, కొడాలి నాని, ఆదిమూలపు సురేశ్ వివిధ శాఖల ఉన్నతాధికారులు, పలు బ్యాంకుల ప్రతినిధులు, పథకం లబ్ధిదారులు పాల్గొన్నారు.