కేసీఆర్ పాలనలో హైదరాబాద్ నెంబర్ వన్: కేటీఆర్

కేసీఆర్ పాలనలో హైదరాబాద్ నెంబర్ వన్: కేటీఆర్

కూకట్ పల్లి: హైదరాబాద్ నగరం టీఆర్ఎస్ పాలనలో ముందెన్నడూ లేని విధంగా అభివృద్ధిలో దూసుకువెళ్తోందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కూకట్ పల్లి నుండి జీహెచ్ఎంసి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన కేటీఆర్ కూకట్ పల్లి, కుత్భుల్లాపూర్ లలో నిర్వహించిన రోడ్ షోలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఆరేళ్లలో హైదరాబాద్ నగరం ఎంతో ప్రశాంతతో ఉందని, ఈ ప్రశాంతతను కాపాడుకోవాల్సిన భాద్యత మన అందరిమీద ఉందన్నారు. కులం, మతం, ప్రాంతంతో నిమిత్తం లేకుండా నగర ప్రజలందరం కలిసి మెలిసి ఉంటున్నామన్నారు. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టే కుట్రలు జరుగుతున్నాయన్నారు. మొన్న కరోనా వచ్చినా, నిన్న వరదలు వచ్చినా ప్రజల వెంట ఉన్నది టీఆర్ఎస్ పార్టీ అన్న విషయం ప్రజలకు తెలుసన్నారు. వరద బాధితులను ఆదుకున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న వరదసాయాన్ని ఆపింది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. ఎన్నికల్లో గెలిస్తే 25 వేల రూపాయలు ఇస్తామని కొంతమంది ప్రజల్ని మభ్య పెడుతున్నారని, అంతేకాదు చలాన్లు కడతాం, అదిస్తాం, ఇదిస్తాం అంటూ తలా తోక లేకుండా మాట్లాడుతున్నారన్నారు. మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న వరద సాయం 10 వేల రూపాయలను ఆపినోళ్లు ఇయ్యాల 25 వేల రూపాయలు ఇస్తామనడం అమ్మకు అన్నం పెట్టనోళ్లు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాం అన్నట్టుగా ఉందన్నారు. మీరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు నమ్మడానికి ఇది అమాయకపు అహ్మదాబాద్ కాదు, హుషారు హైదరాబాద్ అని గుర్తుపెట్టుకోవాలన్నారు. ఈ ఆరేళ్లలో సీఎం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణకు హైదరాబాద్ కు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమిచేసిందో చెప్పడానికి ఒక్క అన్నపూర్ణ, ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్, ఒక బస్తీ దావఖానా, మంచి నీళ్లు, కరెంటు ఇలా చెప్పుకుంటూ పొతే 67 వేల కోట్లతో వంద కార్యక్రమాలు చెబుతామన్నారు. కానీ ఈ ఆరేళ్లలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏమిచేసిండో కేంద్రం నుండి హైదరాబాద్ నగరానికి ఎన్ని పైసలు తెచ్చిండో చెప్పాలన్నారు. హైదరాబాద్ నగర ప్రజలను ఏం మొకం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని కేంద్రమంత్రిని నిలదీశారు.కేసీఆర్ పాలనలో హైదరాబాద్ నెంబర్ వన్: కేటీఆర్పచ్చగా ఉన్న హైదరాబాద్ నగరంలో అలజడి, సృష్టించే ప్రయత్నం, నిప్పుపెట్టే కుట్రలను చేస్తున్నారన్నారు. హిందూ ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని, మతాల మధ్య చిచ్చుపెట్టాలని బీజేపీ నాయకులు చూస్తున్నారన్నారు. ఎప్పుడూ ఇండియా-పాకిస్తాన్. హిందూ- ముస్లిం అంటూ విద్వేషాలు రెచ్చగొట్టి నాలుగు ఓట్లు రాల్చుకోవడానికి చేస్తున్నకుట్రలు నగర ప్రజలు గమనించాలన్నారు. హైదరాబాద్ లో ఎక్కడా గుడులు లేనట్లు బీజేపీ నాయకులు పాతబస్తీ లోని చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి దేవాలయానికి వెళ్లడం వాళ్ళ అసలు స్వరూపాన్ని బయటపెడుతుందన్నారు. హైదరాబాద్ నగరంలో అలజడి సృష్టించి చలికాచుకోవాలని చూస్తున్నారన్నారు. ఇలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. హైదరాబాద్ నగరాన్ని కొందరి నగరం చేయాలని చూస్తున్న వ్యక్తుల కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఏ రకమైన హైదరాబాద్ ఉంటె మన పిల్లా పాపలు ప్రశాంతంగా ఉంటారో, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయో ప్రజలు ఆలోచించాలన్నారు. హైదరాబాద్ శాంతి భద్రతలకు విఘాతం కలిగితే దాని ప్రభావం రాష్ట్రం మొత్తం మీద ఉంటుందన్నారు.
అభివృద్ధి కావాలో అరాచకం కావాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు.

గత ఆరేండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అనేక రంగాల్లో హైదరాబాద్ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకున్నామన్నారు. ఒక ఆపిల్, ఒక అమెజాన్, ఒక గూగుల్ వంటి కంపెనీలు ఈ రోజు హైదరాబాద్ నగరానికి వస్తున్నాయంటే దానికి కారణం నగరంలో ఉన్న ప్రశాంతత, శాంతి భద్రతలే అన్నారు. అలాంటి శాంతిభద్రలకు విఘాతం కలిగించే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. గతంలో లాగా హైదరాబాద్ లో ఎలాంటి అలజడులూ లేవన్నారు.ఈ ఆరేళ్లలో నగరాన్ని ఒక బస్తీ దావఖానాలు కానీ, నీళ్లు గానీ, కరెంటు గానీ ఏ రకంగా నైతే అభివృద్ధి చేసుకున్నామో అదే అభివృద్ధిని కొనసాగించాలంటే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను పెద్ద మెజారిటీతో గెలిపించుకోవాలన్నారు. ఈసారి జీచ్ఎంసీ ఎన్నికల్లో సెంచరీ కొట్టాలని ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ నగరం అభివృద్ధిలో మరింత ముందుకు పోవాలంటే ప్రజలందరూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కి మద్దతు తెలపాలన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.