టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కీలక విషయాలు
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. పేపర్ లీకేజ్ నిందితుడు ప్రవీణ్ మొత్తం ఐదు పేపర్లను కంప్యూటర్ నుంచి కొట్టేసినట్లు విచారణలో వెల్లడైంది. రాజశేఖర్ అనే వ్యక్తి సాయంతో ప్రవీణ్ పేపర్లు కొట్టేశాడు. ప్రవీణ్‌కు లబ్ధి చేకూర్చేందుకు రాజశేఖర్ ల్యాన్‌లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇక లీకేజీ వ్యవహారంపై విచారిస్తున్న సిట్ చీఫ్ టీఎస్‌పీఎస్సీ అధికారులతో భేటీ అయ్యారు. లక్ష్మి దగ్గర పాస్‌వర్డ్ ఎప్పుడు చోరీ చేశారన్న దానిపై ఆరా తీస్తున్నారు.
ప్రవీణ్ కొట్టేసిన పేపర్లలో ఏఈతో పాటు టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్షా పత్రాలు ఉండగా ఆ పరీక్షలు ఇప్పటికే అయిపోయాయి. వీటితో పాటు భవిష్యత్‌లో జరగబోయే అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ పోస్టుల పేపర్లు కూడా ప్రవీణ్ దగ్గరే ఉన్నాయి. అయితే సమయం వచ్చినప్పుడు ఆ పేపర్లను విక్రయించాలని ప్లాన్ చేశాడు ప్రవీణ్. వీటితో పాటు భవిష్యత్‌లో మరిన్ని పేపర్లు కొట్టేసే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రవీణ్, రేణుక మధ్య పేపర్లు ఇచ్చే డీల్ కుదిరినట్లు సమాచారం.