తడి, పొడి చెత్త నుంచి ఎరువు తయారీ

10 కిలోలు కొనుగోలు చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి
మనం – మన పరిశుభ్రతను పాటించాలని పిలుపుతడి, పొడి చెత్త నుంచి ఎరువు తయారీ

తిరుపతి: తుమ్మల గుంట గ్రామంలో ఇంటింటి నుంచి సేకరించిన తడి – పొడి చెత్త ద్వారా తయారు చేసిన ఎరువును ఎమ్మెల్యే చెవిరెడ్డి కొనుగోలు చేశారు. సోమవారం ఈ కార్యక్రమం తుమ్మల గుంట ఆలయం ఎదుట నిర్వహించారు. మొత్తం 200 కిలోలకు గాను, పది కిలోల ఎరువును కిలో రూ.16 చొప్పున ఎమ్మెల్యే కు విక్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మనం – మన పరిశుభ్రత కార్యక్రమం అమలుకు శ్రీకారం చుట్టిందన్నారు. తద్వారా చంద్రగిరి నియోజకవర్గంలోని గ్రామాల్లో పరిశుభ్ర వాతావరణం నెలకొందన్నారు. అంతే కాకుండా అంటురోగాలు కూడా ప్రజలకు దరి చేరడం లేదన్నారు. కరోనా వైరస్ పట్ల ప్రజలు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి అధికారులకు సూచించారు. పరిసరాలు, పరిశుభ్రత పట్ల అవగాహనతో మెలగాలని కోరారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతను పాటించాలన్నారు. తడి, పొడి చెత్త సేకరణలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఘన, ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ ప్రక్రియ ద్వారా ఎరువును తయారు చేస్తుండటం పట్ల నిర్వాహకులను చెవిరెడ్డి అభినందించారు. ఎరువు విక్రయం ద్వారా పంచాయతీకి ఆర్థిక సహకారం అందిపుచ్చుకోవడం శుభపరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో జీపీ కార్యదర్శి మధుసూదన్, అరుణ్ కుమార్, యోగ, మహేష్, గ్రామ పెద్దలు రామచంద్ర రెడ్డి, దేవిరెడ్డి, జయచంద్ర రెడ్డి, కృష్ణారెడ్డి, మధు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.