గవర్నర్ మౌనం పై మంత్రి సత్యవతి ఫైర్  

గవర్నర్ మౌనం పై మంత్రి సత్యవతి ఫైర్  గవర్నర్ మౌనం పై మంత్రి సత్యవతి ఫైర్  

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మహిళా సమాజం తీవ్రంగా ఖండిస్తుందని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి మాటలకు తావు లేదని సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. కవితపై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై గవర్నర్ తమిళిసై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో చీమ చిటుక్కుమంటే స్పందించే గవర్నర్ ఇప్పుడేం చేస్తున్నారని నిలదీశారు. సంజయ్ వ్యాఖ్యలపై గవర్నర్ స్పందించాలని డిమాండ్ చేశారు.

బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడైన తర్వాత ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుండటం సిగ్గుచేటన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. ఆయన రాజకీయ విలువల్లేని వ్యక్తి అని విమర్శించారు. మహిళలను గౌరవించకుండా మాట్లాడే వ్యక్తి రాజకీయాల్లో ఉండటం దురదృష్టకరమన్నారు. మహిళలు తలదించుకునేలా బండి సంజయ్ వ్యాఖ్యానించడంపై మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా మండిపడ్డారు. ఆయన మాట్లాడే ప్రతీ మాట వ్యక్తిగతమా పార్లీ లైనా స్పష్టం చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. సీబీఐ, ఈడీ దాడులకు తెలంగాణ బిడ్డలు భయపడరని సత్యవతి రాథోడ్ తేల్చిచెప్పారు.