మోదీ,అమిత్ షాలపై దావా కొట్టేసిన కోర్టు

మోదీ,అమిత్ షాలపై దావా కొట్టేసిన కోర్టుహూస్టన్ : ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలపై కశ్మీర్ ఖలిస్తాన్ రెఫరెండమ్ ఫ్రంట్ వేసిన దావాను అమెరికా కోర్టు కొట్టేసింది. ఈ దావా వేసిన వాళ్లు రెండుసార్లు కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో జడ్జి ఫ్రాన్సెస్ హెచ్.స్టేసీ దీనికి కొట్టేశారు. ఈ దావాను గతేడాది సెప్టెంబర్ 19న ఫైల్ చేశారు. హూస్టన్ లో ప్రధాని మోదీ హౌడీ, మోదీ ప్రోగ్రామ్ కు కొన్నిరోజుల ముందే ఈ దావా వేయడం విశేషం. మోదీ, అమిత్ షా, లెఫ్ట్ నెంట్ జనరల్ కన్వల్ జీత్ సింగ్ ధిల్లాన్ నుంచి తమకు నష్టపరిహారంగా 10 కోట్ల డాలర్లు ఇప్పించాలని అందులో కోరింది. జమ్ము కశ్మీర్ కు ప్రత్యేక హక్కులు కల్పించే ఆర్టికల్ ను రద్దు చేసి, రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని సవాలు చేస్తూ కశ్మీర్ ఖలిస్తాన్ రెఫరెండమ్ ఫ్రంట్ ఈ దావా వేసింది. అయితే ఈ ఫ్రంట్ కేసు వేసింది తప్ప , దీనిని విచారించడానికి సమర్పించాల్సిన పత్రాలను మాత్రం ఇవ్వలేదని , రెండు సార్లు కోర్టుకు కూడా హాజరు కాలేదని జడ్జి స్టేసీ తన తీర్పులో చెప్పారు. కశ్మీర్ ఖలిస్తాన్ రెఫరెండమ్ ఫ్రంట్ తరపున వేర్పాటువాద లాయర్ గుర్పత్ వంత్ సింగ్ పన్నమ్ వాదనలు వినిపించారు.