తల్లి, చెల్లి పై కనికరం లేదు

మేడ్చల్‌ జిల్లా: నవమాసాలు మోసిన కన్న తల్లిని, తోడబుట్టిన చెల్లిని ఏమాత్రం కనికరం లేకుండా అన్నంలో విషం పెట్టి కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. ఊరు ఊరంతా అయ్యో పాపమని కన్నీరు కార్చినా.. తన కన్న వారి కోసం ఓ కన్నీటి చుక్కనైనా రాల్చకపోవడాన్ని చూసి అనుమానం వచ్చిన గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు నిజం బయటకు వచ్చింది.ఈ దారుణమైన ఘటన మేడ్చల్‌ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మేడ్చల్‌ మండలం రావల్‌కోల్‌ గ్రామానికి చెందిన పల్లి ప్రభాకర్‌రెడ్డి, సునీత దంపతులకు కొడుకు సాయినాథ్‌రెడ్డి, కూతురు అనూష ఉన్నారు.తల్లి, చెల్లి పై కనికరం లేదుప్రభాకర్‌రెడ్డి మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కుమారుడు సాయినాథ్‌రెడ్డి కండ్లకోయ సీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ పూర్తిచేసి అదే కాలేజీలో ఎంటెక్‌ చేస్తూ ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. సాయినాథ్‌రెడ్డి బెట్టింగ్‌లకు అలవాటుపడి అప్పుల పాలయ్యాడు. ఈ క్రమంలో తండ్రి ప్రభాకర్‌రెడ్డి మృతిచెందిన సమయంలో వచ్చిన రూ.18లక్షలు బ్యాంకులో ఉండటాన్ని సాయినాథ్‌రెడ్డి గ్రహించాడు. తల్లికి, చెల్లికి తెలియకుండా బ్యాంకులోని డబ్బులు డ్రా చేయడంతో పాటు ఇంట్లో ఉన్న 10 నుంచి 15 తులాల బంగారు నగలను కూడా అమ్మేశాడు. ఈవిషయం ఇంట్లో తెలుస్తుందోనని భయాందోళనలకు గురైన సాయినాథ్‌రెడ్డి తన తల్లి, చెల్లిని కడతేర్చాలని పన్నాగం పన్నాడు. ఈనెల 23న తినే అన్నంలో రసాయన గుళికలు కలిపాడు. అదే అన్నంను కంపెనీకి వెళ్తూ టిఫిన్‌ తీసుకెళ్లాడు. విషాహారం తిన్న తల్లి, చెల్లెలు.. ‘కడుపులో తిప్పినట్లు అవుతోంది’ అంటూ సాయినాథ్‌రెడ్డికి ఫోన్‌ చేసి చెప్పారు. ఇంటికి వచ్చిన అతడు తల్లి, చెల్లెలు తమను ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పినా వినలేదు. స్పృహ తప్పిపోయే వరకు వేచిచూసి 23వ తేదీన రాత్రి 8 గంటలకు మేడ్చల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆరోగ్యం విషమించిందనే కారణంతో.. మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. వెంటనే వారిని సుచిత్ర పరిధిలోని రెనోవా ఆస్పత్రికి సాయినాథ్‌ తీసుకెళ్లినా.. వైద్య ఖర్చులకు డబ్బులు లేవంటూ సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించాడు. నవంబరు 24న తెల్లవారుజాముకల్లా గాంధీకి చేరుకున్నారు. ఇక్కడ చికిత్స మొదలైన తర్వాత.. నాలుగోరోజున (27వ తేదీన) చెల్లెలు అనూష మృతిచెందగా, ఐదో రోజున (28న) తల్లి సునీత మృతిచెందారు.

పోలీసులు, ఆస్పత్రుల నిర్లక్ష్యం
విషాహారం తిన్న ఎనిమిది గంటల తర్వాత .. చికిత్స అందడంతో సునీత, అనూషల ప్రాణాలు నిలువలేదు. విషాహారం తీసుకోవడానికి గల కారణాలను ఆరాతీసి, పోలీసులకు సమాచారాన్ని అందించడంలో మేడ్చల్‌ ప్రభుత్వ ఆస్పత్రి, రెనోవా ఆస్పత్రి, గాంధీ ఆస్పత్రి విఫలమయ్యాయి. ప్రస్తుతం గాంధీ కొవిడ్‌-19 ఆస్పత్రి కావడంతో.. సునీత, అనూషల మృతదేహాలకు ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. విచారణ చేపట్టకుండానే మృతదేహాల్ని మేడ్చల్‌ పోలీసులు సాయినాథ్‌కు అప్పగించారు. తల్లి, చెల్లికి అంత్యక్రియలు నిర్వహించే క్రమంలో సాయినాథ్‌రెడ్డిని బంధువులు నిలదీయడంతో ఆలస్యంగా నిజం వెలుగులోకి వచ్చింది. సాయినాథ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.