భారత్ బంద్ ను జయప్రదం చేయండి: దాస్యం

భారత్ బంద్ ను జయప్రదం చేయండి: దాస్యంవరంగల్ అర్బన్ : కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వ్యవసాయ బిల్లులు రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వున్నాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. కేంద్రప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులకు టీఆర్ఎస్ పార్టీ సెల్యూట్ చేస్తుందని, వారికి సంఘీభావంగా టీఆర్ఎస్ శ్రేణులు డిసెంబర్ 08న జరిగే భారత్ బంద్ లో భాగస్వాములు కావాలని దాస్యం వినయ్ భాస్కర్ వరంగల్ కేంద్రంగా పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా రైతులు, కార్మిక సంఘాలు తలపెట్టిన భారత్ బంద్ కు సంపూర్ణ మద్ధతు తెలుపుతూ వరంగల్ అర్బన్ జిల్లా పశ్చిమ నియోజకవర్గంలో నిరసన ర్యాలీ చేపట్టారు. రేపటి భారత్ బంద్ లో భాగంగా రైతులకు మద్దతుగా రైళ్లను నిలిపివేయాలని కాజీపేట జంక్షన్ రైల్వే స్టేషన్ మేనేజర్ కి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ వినతి పత్రం అందించారు. తదనంతరం కాజీపేట రైల్వేజంక్షన్ నుంచి హన్మకొండ బాలసముద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఉద్యానవనం వరకు ఎడ్లబండ్ల మీద ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రైతులు, రైతు సంఘాలు, కార్మిక సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఉద్యానవనం ఏకశిలా పార్కులో భారత్ బంద్ కు మద్దతుగా రైతులు, కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడారు. తెలంగాణ రైతులకు కేసీఆర్ ప్రభుత్వం ఆత్మవిశ్వాసం నిలిపిందని, దేశ రైతాంగానికి దారి చూపే శక్తిగా టీఆర్ఎస్ ప్రభుత్వం వుందని దాస్యం అన్నారు. పెరుగుతున్న వ్యవసాయ దిగుబడులను ప్రోత్సహించాల్సిన కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ సంస్థలకు లాభం చేకూర్చేలా నిర్ణయం తీసుకోవడం సిగ్గుచేటని వినయ్ భాస్కర్ మండిపడ్డారు. కేంద్రంతో పోరాడుతున్న రైతాంగానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి మద్దతు తెలుపుతుందని ఆయన అన్నారు. రేపటి బంద్ ను విజయవంతం చేసేందుకు అన్ని వర్గాల ప్రజలు సమ్మతించాలని దాస్యం వినయ్ భాస్కర్ కోరారు.