వైభవంగా శ్రీవారికి పుష్పయాగం

 శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి..
 శాస్త్రోక్తంగా పుష్పయాగం
 పాల్గొన్న చెవిరెడ్డి దంపతులు

తిరుమల: తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి పుష్పయాగ మహోత్సవం శనివారం ఆలయ ఆవరణలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ పుష్పయాగం లో చెవిరెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఉదయం స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ క్రమంలో పాలు, పెరుగు, కొబ్బరినీళ్లు, పసుపుతో తేనె తదితరాలతో విశేషంగా అభిషేకం ప్రక్రియను కన్నుల పండువగా నిర్వ‌హించారు.వైభవంగా శ్రీవారికి పుష్పయాగంపుష్ప‌యాగం సందర్భంగా ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వివిధ రకాల పుష్పాలను తెప్పించారు. తమిళనాడు, బెంగుళూరు, తెలంగాణ రాష్ట్రాల నుంచి చామంతి, రోజాలు, సంపంగి, తామర పూలు, మల్లెపూలు, కనకాంబరాలు, మొగిలి రేకులు, గన్నేరు వంటి తదితర పుష్పాలను దాదాపు 2 టన్నులతో శ్రీవారికి వేడుకగా పుష్పయాగం నిర్వహించారు. ముందుగా ఆలయ వాహన మండపం నుంచి పుష్పాలు, పత్రాలను మాడ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ శోభాయమానంగా పుష్పయాగ మహోత్సవం జరిగింది. ఇటీవల జరిగిన బ్రహ్మోత్సవాలలో, నిత్యకైంకర్యాలలో ఏదేని తప్పిదాలు జరిగి ఉంటే పరిహారంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అర్చకులు గిరి పేర్కొన్నారు.వైభవంగా శ్రీవారికి పుష్పయాగం