ఒక్కరోజు మాకు హోంశాఖ ఇచ్చి చూడు రేవంత్..
-పోలీసుల సత్తా ఏంటో చూపిస్తాం
-రేవంత్ పాలనలో పోలీసులకు ఇంత ఘోరమైన అవమానమా?
-ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
వరంగల్ టైమ్స్, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి మీకు పాలన చాత కాకపోతే ఒక్కరోజు బీఆర్ఎస్ పార్టీకి హోంశాఖ ఇచ్చి చూడండి పోలీసుల పవర్ ఏందో చూపిస్తాము అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోలీసుల మీద జగ్గారెడ్డి బూతు పురాణం పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. మీ అమ్మకి పుట్టిన్రా, మీ అయ్యకి పుట్టిన్రా అంటూ పోలీసులను తిట్టడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మీరే హోంమంత్రి.. మీకు చాత కావడం లేదు అందుకే మీ దగ్గర ఉన్న సీనియర్ రాజకీయ నాయకులు పోలీసులను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ఈ విషయంపై ఎక్స్ వేదికంగా స్పందించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోషల్ మీడియాలో ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు.
తన మనిషిని బయటకు గెంటి వేశాడన్న నింద మోపి పోలీసులను సీఐ, ఎస్సైలను, హోంగార్డులను గా@#డు గాళ్లు, నా కొడుకులు అని నానా దుర్భాషలాడిన జగ్గారెడ్డిపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. పైగా పోలీసుల మీదే దాడి చేసే ప్రయత్నం చేసిన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసు అధికారులు ‘బుజ్జగించి ప్రాధేయపడడం’ తెలంగాణలో అడుగంటిన పోలీసు ఆత్మస్థైర్యాన్ని సూచిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. డీజీపీ వెంటనే స్పందించి జగ్గారెడ్డి మీద కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఏ పాపం ఎరుగని బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తల మీద చీటికిమాటికి చిల్లర కేసులు పెట్టి, జైలుకు పంపించి, సుప్రీం కోర్టులో కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేస్తున్న తెలంగాణ పోలీసులకు, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీద ఇప్పటికీ 353 IPC (121 BNS) 270 BNS సెక్షన్ల కింద క్రిమినల్ కేసు ఎందుకు నమోదు చేయలేకపోతున్నారు? అని ప్రశ్నించారు. సుమోటో గా కేసు చేయకపోవడం వల్ల వేలాది పోలీసులకు, హోంగార్డులకు ఏం సంకేతాలు ఇస్తున్నారని మండిపడ్డారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
అసలు ఏం జరిగిందంటే..?
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు సంగారెడ్డి పట్టణంలోని 34వ వార్డు ఇందిరా కాలనీలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సీసీఎస్ సీఐ శివకుమార్, ఇతర సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా ఎన్నికల నిబంధనలో భాగంగా మొబైల్ ఫోన్ తీసుకురావద్దని చెప్పడంతో తూర్పు జగ్గారెడ్డి తన కార్యకర్తను ఆపుతారా..? అంటూ ఆగ్రహావేశానికి లోనై సీఐ శివకుమార్, హోంగార్డు చెన్నయ్య పై వ్యక్తిగత దూషణలతో వారి కుటుంబ సభ్యులకు, పోలీసు పరువు ప్రతిష్టలకు భంగం బాటిల్లే విధంగా విధులకు ఆటంకం కలిగిస్తూ దుర్భాషలాడారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తక్షణమే జగ్గారెడ్డిపై అధికారులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పలువురు పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా రాజకీయ నాయకులు అనునిత్యం దాడులు చేస్తూ మా విలువలను దిగజార్చుతున్నారని.. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకొని సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు పోలీస్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.














