బెంగాల్‌లో తృణమూల్‌ కార్యకర్త హత్య

బెంగాల్‌లో తృణమూల్‌ కార్యకర్త హత్య

బేరక్‌పుర్‌/కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ హత్యల పరంపర కొనసాగుతోంది. తాజాగా బుధవారం ఉత్తర పరగణాల ప్రాంతంలో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త ఆకాశ్‌ ప్రసాద్‌(22) హత్యకు గురయ్యాడు. అతన్ని కత్తులతో పొడిచి, బాంబులు విసిరి కిరాతకంగా చంపారు. పోలీసుస్టేషన్‌ సమీపంలోని రోడ్డుపైనే ఈ ఘటన జరగడం గమనార్హం. స్థానిక భాజపా నాయకులే కుట్ర పన్ని తమ కార్యకర్తను చంపారని తృణమూల్‌ నేతలు ఆరోపించారు. గత ఏడాదిన్నగా ఈ ప్రాంతంలో భాజపా భయానక వాతావరణం సృష్టిస్తోందన్నారు. కాగా చనిపోయిన వ్యక్తిపై పలు క్రిమినల్‌ కేసులున్నాయని, జరిగిన హత్యతో భాజపాకు ఎలాంటి సంబంధం లేదని బేరక్‌పుర్‌ ఎంపీ, భాజపా నేత అర్జున్‌ సింగ్‌ చెప్పారు.

పెచ్చుమీరిన రాజకీయ హింస-గవర్నర్‌ జగదీప్‌ ధనకర్‌

పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ హింస మరింతగా పెరిగిపోతోందని గవర్నర్‌ జగదీప్‌ ధనకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం రాజకీయ ప్రేరేపితంగా మారిపోయిందని, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందన్నారు. పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం రాజకీయంగా తటస్థంగా ఉండాలన్న నిర్దేశకాలు ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీల నుంచి రావడం లేదంటూ ట్విటర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు.