ఉక్రెయిన్ కు అమెరికా భారీ సహాయం

ఉక్రెయిన్ కు అమెరికా భారీ సహాయంవరంగల్ టైమ్స్, ఇంటర్నెట్ డెస్క్: రష్యా దురాక్రమణను ఉక్రెయిన్ ఎదుర్కొనేందుకు పలు దేశాలు మద్దతు ఇస్తున్నాయి. నేరుగా కదనరంగంలోకి దిగకపోయినా పరోక్షంగా సహకారం అందిస్తున్నాయి. ఇప్పటికే ఫ్రాన్స్ తో పాటు పలు దేశాలు ఆయుధాలను పంపిస్తున్నట్లు ప్రకటించాయి. తాజాగా ఉక్రెయిన్ కు అమెరికా కొత్తగా సహాయం ప్రకటించింది. రష్యాను ఎదుర్కొనేందుకు అదనంగా 350 మిలియన్ డాలర్ల ( సుమారు రూ.2,627 కోట్లు) విలువైన సైనిక పరికరాలను అందిస్తామని ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ శనివారం తెలిపారు.

నేల, నింగితో పాటు ఇతర దాడుల ముప్పును ఉక్రెయిన్ ఎదుర్కొనేందుకు మూడో ప్యాకేజీ కింద అత్యాధునిక రక్షణ పరికరాలను అందచేస్తామని పేర్కొన్నారు. రష్యా అన్యాయ యుద్ధంపై ఉక్రెయిన్ పోరాడేందుకు ఇది సహాయపడుతుందని ఆంటోనీ బ్లింకెన్ ఆశాభావం వ్యక్తం చేశారు. రష్యా దాడి ముప్పు నేపథ్యంలో గత యేడాది డిసెంబర్ లో మొదట 200 మిలియన్ డాలర్ల సైనిక సహకారం, రష్యా బలగాల మోహరింపు నేపథ్యంలో 60 మిలియన్ డాలర్ల సైనిక పరికరాలను ఉక్రెయిన్ కు అమెరికా అందించినట్లు ఆయన వెల్లడించారు.