కుప్పకూలిన చాపర్..పైలట్ మృతి

కుప్పకూలిన చాపర్..పైలట్ మృతి

వరంగల్ టైమ్స్, హైదరాబాద్: నల్లగొండ జిల్లా పెద్దవూర పోలీస్ స్టేషన్ పరిధిలోని తుంగతుర్తి గ్రామ సమీపంలో శనివారం ఉదయం 10.50 గంటలకు చాపర్ కుప్పకూలిపోయినట్లు ఎస్పీ రెమా రాజేశ్వరి వెల్లడించారు. ఘటనా స్థలిని పరిశీలించిన అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడారు. స్థానిక రైతులు, కూలీలు సమాచారం అందించిన వెంటనే లోకల్ పోలీసులు, సర్పంచ్, ఉపసర్పంచ్ ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారని తెలిపారు. ఇది సాధారణ ఏవియేషన్ ఎయిర్ క్రాఫ్ట్ అని పేర్కొన్నారు. దీన్ని శిక్షణతో పాటు వ్యక్తిగత అవసరాలకు కూడా వినియోగిస్తారు. ప్రమాదానికి గురైన చాపర్ ను మాచర్లలోని ఓ ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీకి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ గా గుర్తించామన్నారు.

శిక్షణలో భాగంగా తమిళనాడుకు చెందిన ట్రైనీ పైలట్ మహిమ, ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీ నుంచి ఉదయం 10.30కి టేకాఫ్ అయింది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై డీజీసీఏ, పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ రెమా రాజేశ్వరి పేర్కొన్నారు. చాపర్ కూలిన సమయంలో భారీ శబ్దం వినిపించిందని స్థానిక రైతులు, కూలీలు పేర్కొన్నారు. దట్టమైన మంటలు, పొగలు వచ్చినట్లు తెలిపారు. హెలికాప్టర్ కూలిన వెంటనే అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించామని పేర్కొన్నారు. నాగార్జున సాగర్ వైపు నుంచి హెలికాప్టర్ వచ్చినట్లు రైతులు పేర్కొన్నారు.

ప్రమాదానికి గురైన చాపర్ ను మాచర్ల మండలం నాగార్జున సాగర్ విజయపురి సౌత్ లో ఉన్న ఫ్లైటెక్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ గా పోలీసులు గుర్తించారు. హై టెన్షన్ విద్యుత్ వైర్లు తగలడంతో అదుపుతప్పి చాపర్ కుప్పకూలినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.