డిఫెన్స్ లో కోమటి రెడ్డి ! 

డిఫెన్స్ లో కోమటి రెడ్డి !

డిఫెన్స్ లో కోమటి రెడ్డి ! వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి గట్టి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. ఓ దశలో పీసీసీ చీఫ్ రేసులో ఉన్నా చివరకు రేవంత్ రెడ్డికి ఆ పోస్టు దక్కింది. అయినప్పటికీ నల్గొండ రాజకీయాలను శాసించేంత స్టామినా కోమటిరెడ్డి కుటుంబానికి ఉంది. అలాంటి ఈ ఫ్యామిలీకి కొంతకాలంగా ఏదీ కలిసి రావడం లేదు. ఆ మధ్య కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. బీజేపీ అభ్యర్థిగా మునుగోడు నుంచి పోటీచేసి బీఆర్ఎస్ చేతిలో ఓడిపోయారు. ఆ సమయంలో వెంకట్ రెడ్డి ఫారిన్ ట్రిప్ పేరుతో ప్రచారంలో పాల్గొనకుండా విదేశాల్లోనే ఉండిపోయారు. పైగా బీజేపీలో ఉన్న సోదరుడిని సపోర్ట్ చేస్తూ మాట్లాడిన ఓ ఆడియో వైరల్ అయ్యింది. ఎలాగోలా ఆ ఎపిసోడ్ నుంచి గట్టెక్కినా కాంగ్రెస్ నేతల దృష్టిలో మాత్రం పలుచనైపోయారు. దానికి తోడు ఆ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి ఓడిపోవడంతో వెంకట్ రెడ్డి కొంతకాలం సైలెంట్ గానే ఉన్నారు. మళ్లీ రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ లో మాణిక్ రావు ఠాక్రే ఆగమనంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి యాక్టివ్ అయ్యారు.

ఠాక్రే కూడా గతం మరిచి పనిచేయాలని సూచించడంతో వెంకట్ రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే ఈ సమయంలో కోమటిరెడ్డి ఒక్కసారిగా మంటల మంటలు పుట్టించారు. ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు సంచలనం సృష్టించాయి. రాష్ట్రంలో హంగ్ వస్తుందని, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందని వ్యాఖ్యానించారు. మాటలైతే మాట్లాడేశారు కానీ దీని ప్రభావం ఏంటో ఆయన అంచనా వేయలేకపోయారు. సొంత పార్టీ నుంచి ఏ స్థాయిలో విమర్శలు ఉంటాయో ఊహించలేకపోయారు. ఇప్పటిదాకా కోమటిరెడ్డి గురించి నోరెత్తని నాయకులు కూడా ఆయన మాటలను తీవ్రంగా ఖండించారు. చివరకు తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ కోమటిరెడ్డి ఓ డైలాగ్ వదిలి మమ అనిపించేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టమైతే జరిగిపోయింది. ఠాక్రే కూడా వెంకట్ రెడ్డికి క్లాస్ తీసుకున్నట్లు టాక్. ఇలాంటి మాటలతో కాంగ్రెస్ శ్రేణుల స్థైర్యాన్ని దెబ్బతీయొద్దని గట్టిగానే చెప్పారట.డిఫెన్స్ లో కోమటి రెడ్డి ! కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఓ సారి ఎంపీగా గెలిచారు. గతంలో మంత్రిగానూ పనిచేసిన అనుభవం ఆయనకుంది. అలాంటి నేత ఒక స్టాండ్ లేకుండా వివాదాస్పదంగా మాట్లాడం కాంగ్రెస్ నేతలు, క్యాడర్ జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా మొన్నటిదాకా ఆయన ఫాలోవర్స్ గా ఉన్న క్యాడర్ కూడా కోమటిరెడ్డి తీరుపై రగిలిపోతున్నారని టాక్.

కోమటిరెడ్డి మరోసారి ఎంపీగా పోటీ చేస్తారా అన్నది డౌటే. ఎమ్మెల్యేగా పోటీచేయడానికే ఆయన మొగ్గు చూపే అవకాశాలున్నాయి. అంటే కోమటిరెడ్డి నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశముంది. కానీ రాజగోపాల్ రెడ్డి బీజేపీలో ఉండడంతో నల్గొండలో బలమైన సామాజికవర్గంగా ఉన్న మైనార్టీలు వెంకట్ రెడ్డికి ఓటేయకపోవచ్చనే వాదన ఉంది. వారంతా ఈసారి బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపవచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఓవైపు కోమటిరెడ్డి మాట్లాడిన మాటలతో కాంగ్రెస్ సొంత క్యాడర్ మనస్ఫూర్తిగా ఆయనకు పనిచేయడం కూడా అనుమానమే. ఇవన్నీ ఆయనకు మైనస్ అయ్యే అవకాశాలున్నాయి. అంటే సొంత నియోజకవర్గంలో గెలవాలంటే కోమటిరెడ్డి చెమటోడ్చక తప్పదు.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పటికైనా ఓ స్టాండ్ పై ఉండడం మంచిదని కాంగ్రెస్ క్యాడర్ సూచిస్తున్నారు. అనవసర డైలాగులు మాని, పార్టీకి పనికొచ్చే పనులు చేయాలని సలహా ఇస్తున్నారు. లేకపోతే కోమటిరెడ్డి పరిస్థితి కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా మారొచ్చని హెచ్చరిస్తున్నారు. మరి ఆయన మారుతారా లేదా అన్నది కాలమే తేల్చాలి.