డబుల్ బెడ్ రూం ఇళ్లను అద్దెకు ఇస్తే చర్యలు

డబుల్ బెడ్ రూం ఇళ్లను అద్దెకు ఇస్తే చర్యలుసిద్దిపేట జిల్లా: కట్టిన ఇళ్లు, పెట్టిన పొయ్యితో మిమ్మల్ని కొత్త ఇంట్లోకి తోలుతున్నాం..ప్రతీ నిరుపేద సంతోషంగా, ఆత్మగౌరవంతో బతకాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. నిరుపేదల కోసం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన డబుల్ బెడ్ రూం ఇండ్లను మొన్నటికి మొన్న సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగానే సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో 180 మంది లబ్దిదారులు గృహ ప్రవేశాలు చేశారు. హైదరాబాద్ గేటెడ్ కమ్యూనిటీ తరహాలో సకల సౌకర్యాలతో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం జరిగిందని అన్నారు. నయా పైసా ఖర్చు లేకుండా , పేదలకు నూతన వస్త్రాలు బహుకరించి గృహ ప్రవేశాలు చేపిస్తున్నాం..లబ్దిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం సంతోషంగా వుందని మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం కేటాయించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను కిరాయికి ఇచ్చినా, విక్రయించినా బాధ్యులపై చర్యలతో పాటు ఇండ్లను తిరిగి స్వాధీనం చేసుకుంటామని మంత్రి హరీష్ రావు హెచ్చరించారు.