ఈ నెల 31న బాధ్యతల స్వీకరణ అమరావతి : ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ నియమితులయ్యారు. ఈ నెల 31న సీఎస్‌గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలం ఈ నెల 31తో ముగియనున్న నేపథ్యంలో ఆమె స్థానంలో ఆదిత్యానాథ్ దాస్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. పదవీకాలం పూర్తి అనంతరం ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా నీలం సాహ్ని విధులు నిర్వర్తించనున్నారు. ప్రధాన కార్యదర్శితో పాటు మరికొన్ని స్థానాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ కార్యదర్శిగా శ్యామలరావు, పురపాలకశాఖ కార్యదర్శిగా వై.శ్రీలక్ష్మి, సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా కే సునీతను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి కార్యాలయం ఉత్తర్వలు జారీచేసింది.