దేశంలోనే 5వ అత్యుత్తమ పీఎస్ గా ‘ఆలేరు’ 

దేశంలోనే 5వ అత్యుత్తమ పీఎస్ గా ‘ఆలేరు’

వరంగల్ టైమ్స్ , హైదరాబాద్ : తెలంగాణలోని ఆలేరు పోలీస్ స్టేషన్ కు అరుదైన గౌరవం దక్కింది. దేశవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న పోలీస్ స్టేషన్ల లో టాప్ 75 జాబితాలో ఆలేరు పోలీస్ స్టేషన్ నిలిచింది. కేంద్ర హోంశాఖ విడుదల చేసిన దేశంలోని ఉత్తమ పోలీస్ స్టేషన్ల జాబితాలో ఆలేరు పోలీస్ స్టేషన్ 5వ స్థానం దక్కించుకుంది. దేశంలోనే 5వ అత్యుత్తమ పీఎస్ గా 'ఆలేరు' రాష్ట్రంలో ఆలేరు పోలీస్ స్టేషన్ అత్యుత్తమ స్టేషన్ గా నిలిచింది. అయితే పోలీస్ స్టేషన్ల పనితీరు. మౌలిక సదుపాయాల ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటించారు. అదే సమయంలో పౌరుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని ర్యాంకులను ప్రకటించినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది.

భువనగిరి జోన్ లోని ఆలేరు పోలీస్ స్టేషన్ అత్యుత్తమ 5వ పీఎస్ గా నిలవడంపై రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చిన ఎక్సలెన్స్ సర్టిఫికెట్ ను సీపీ మహేశ్ భగవత్ స్టేషన్ సిబ్బందికి అందచేశారు. ఈ సందర్భంగా ఆలేరు పోలీస్ స్టేషన్ సిబ్బందిని రాచకొండ సీపీ అభినందించారు.

దేశ వ్యాప్తంగా 75 పోలీస్ స్టేషన్లను ఎంపిక చేస్తే, ఆలేరు పీఎస్ 5వ స్థానంలో నిలవడం గర్వకారమన్నారు సీపీ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పోలీస్ స్టేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని తెలిపారు. తెలంగాణ పోలీసులు పౌరులకు అత్యుత్తమ సేవలను అందిస్తున్నారనడానికి ఇది నిదర్శనమని చెప్పారు. నేరాలను పూర్తిగా నిరోధించగలిగామని స్పష్టం చేశారు.