ఆంధ్రా తీరమే అత్యంత సురక్షితం : సీడబ్ల్యూసీ

ఆంధ్రా తీరమే అత్యంత సురక్షితం : సీడబ్ల్యూసీ

ఆంధ్రా తీరమే అత్యంత సురక్షితం : సీడబ్ల్యూసీ

వరంగల్ టైమ్స్, అమరావతి : దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతం అత్యంత భద్రం, సురక్షితమని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అధ్యయనం స్పష్టం చేసింది. అలల ఉధృతి అధికంగా ఉండటం వల్ల అండమాన్‌–నికోబార్‌ దీవులు, కేరళ, ఒడిశా, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రల్లో తీర రేఖ అధికంగా కోతకు గురవుతోందని వెల్లడించింది. దేశంలో 1,144.29 కి.మీ.ల పొడవునా తీర రేఖ ఎక్కువగా కోతకు గురవుతోందని పేర్కొంది. ఆ తీర ప్రాంతంలో 3,679.91 హెక్టార్ల భూమి తీవ్రంగా కోతకు గురైందని ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో 973.7 కి.మీ.ల పొడవైన తీర రేఖ ఉండగా కేవలం 15 కి.మీ.ల పొడవునా మాత్రమే సముద్రపు అలల ప్రభావం అధికంగా ఉందని తెలిపింది.ఈ నేప థ్యంలో సీడబ్ల్యూసీ అధ్యయన నివేదికను విశ్లేషించిన పారిశ్రామికవేత్తలు పోర్టులు, హార్బర్ల నిర్మాణానికి, వాటి ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ అత్యంత అనువైన ప్రాంతమని చెబుతున్నారు.

దేశంలో రెండో అతి పొడవైన తీర ప్రాంతం ఆంధ్రా తీరమే : మన దేశానికి తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం సరిహద్దులుగా ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, డయ్యూ డామన్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, లక్ష్యద్వీప్, అండమాన్‌–నికోబార్‌ దీవుల పొడవున 7,516.6 కి.మీ.ల పొడవైన సుదీర్ఘ తీర రేఖ ఉంది. దేశంలో అతి పొడవైన తీర రేఖ ఉన్న రాష్ట్రంగా గుజరాత్‌ (1,214.7 కి.మీ.లు) మొదటి స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌ (973.7 కి.మీ.లు) రెండో స్థానంలో నిలిచింది.