టీం ఇండియా హెడ్ కోచ్ గా అనిల్ కుంబ్లే ?

టీం ఇండియా హెడ్ కోచ్ గా అనిల్ కుంబ్లే ?ముంబై : టీంఇండియా మెన్స్ క్రికెట్ హెడ్ కోచ్ గా మళ్ళీ అనిల్ కుంబ్లే బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్ తర్వాత ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగియనున్నది. ఆ తర్వాత ఆ పోస్టు కోసం దరఖాస్తు చేసుకోవాలని అనిల్ కుంబ్లేను బీసీసీఐ కోరనున్నట్లు తెలుస్తోంది.

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నట్లు సమాచారం. నిజానికి 2016-2017 మధ్య కాలంలో టీంఇండియా హెడ్ కోచ్ గా అనిల్ కుంబ్లే చేశాడు.సచిన్ , లక్ష్మణ్, గంగూలీ నేతృత్వంలోని అప్పటి అడ్వైజరీ కమిటీ కుంబ్లేను కోచ్ గా నియమించింది. కానీ విరాట్, కుంబ్లే మధ్య మనస్పర్ధలు రావడంతో కుంబ్లే కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. ఐపీఎల్ లోని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మెంటర్ గా ఉన్న లక్ష్మణ్ కు కూడా కోచింగ్ బాధ్యతలు అప్పగించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

లక్ష్మణ్ పోటీలో ఉన్నా, కుంబ్లేనే హెడ్ కోచ్ పోస్టుకు ఫేవరేట్ గా ఉంటారని అంచనాలు వేస్తున్నారు. బీసీసీఐ ఆలోచనలు బాగానే ఉన్నా, కుంబ్లే, లక్ష్మణ్ లు హెడ్ కోచ్ పోస్టుకు దరఖాస్తు చేసుకుంటారా లేదా అన్న విషయం ఇప్పుడే చెప్పలేం. టీ 20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి క్రికెట్ కు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు కోహ్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. లక్ష్మణ్, కుంబ్లేలు ఇద్దరూ వందకు పైగా టెస్టులు ఆడిన నేపథ్యంలో వారికి కోచ్ పదవి దక్కేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. మాజీ బ్యాట్స్ మెన్ విక్రమ్ రాథోడ్ కూడా కోచ్ పోస్టుకు పోటీపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.