ఏపీ అసెంబ్లీ: దిశా చట్టానికి సవరణలు

ఏపీ అసెంబ్లీ: దిశా చట్టానికి సవరణలుఅమరావతి: దిశా చట్టం సవరణ బిల్లు ఆమోదం సందర్భంగా టీడీపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు. తమ​కు మాట్లాడే ఇవ్వాలని పట్టుబడుతూ సభా కార్యకలాపాలకు అడ్డుతగిలారు. ఎవరెవరు మాట్లాడతారో ముందుగా తన లిస్టు పంపించకుండా ఇలా మధ్యలో అడగడం సభా సంప్రదాయాలకు విరుద్ధమని స్పీకర్‌ వివరణయిచ్చారు. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌, ఆదిమూలపు సురేశ్‌.. టీడీపీ సభ్యుల తీరును తప్పుబట్టారు. టీడీపీ సభ్యుల నినాదాల నడుమ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ ల్యాండ్‌ టైట్లింగ్‌ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు.

దిశా చట్టానికి 4 జాతీయ అవార్డులు: సుచరిత
గతంలో చేసిన దిశా చట్టానికి సవరణలు చేసి తాజాగా శాసనసభలో పెట్టారు. సవరణ బిల్లుపై హోం మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారులపై జరిగే దాడుల నివారణకు దిశా చట్టాన్ని తెచ్చినట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 18 దిశా పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేశామని, విచారణ వేగవంతం కోసం డీఎస్పీస్థాయి అధికారిని నియమించినట్టు చెప్పారు. తిరుపతి, మంగళగిరి, విశాఖలో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేశామన్నారు. దిశా చట్టానికి జాతీయస్థాయిలో 4 అవార్డులు వచ్చాయన్నారు. దిశా చట్టంతో బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని విశ్వాసం చేశారు. దిశా చట్టం వచ్చాక 3 కేసుల్లో ఉరిశిక్షలు పడ్డాయని వెల్లడించారు. దిశ యాప్‌ను లక్షలాది మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారని తెలిపారు. మంత్రి ప్రసంగం తర్వాత దిశా చట్టసవరణ బిల్లును సభ ఆమోందించింది.

ఎలక్ట్రిసిటీ డ్యూటి బిల్లు ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ శీతాకాల సమావేశాలు నాలుగో రోజు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఏపీ విద్యుత్‌ సుంకం సవరణ(ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటి అమెంట్‌మెంట్‌) బిల్లుపై చర్చకు స్పీకర్‌ తమ్మినేని సీతారాం అంగీకరించారు. దీంతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చర్చను ప్రారంభించారు. మంత్రి ప్రసంగం తర్వాత బిల్లు సభ ఆమోదం పొందింది. తర్వాత దిశా చట్టంపై చర్చ ప్రారంభమైంది. నగదు బదిలీ, కరోనా కట్టడిపై శాసన సభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. కాగా, మీడియా, బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనారిటీ వర్గాలపై దాడులు అరికట్టాలంటూ చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. అసెంబ్లీకి ర్యాలీగా వచ్చారు.
ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనార్టీ సంక్షేమ పథకాలపై శాసన సభలో చర్చించనున్నారు. శాసన మండలిలో నేడు 9 బిల్లులపై చర్చ జరగనుంది. పోలవరం, ఉద్యోగుల సంక్షేమం, శాంతిభద్రతలపై శాసన మండలి చర్చించనుంది