షరతులు లేకుండా పత్తి కొనాలి: ఎర్రబెల్లి

షరతులు లేకుండా పత్తి కొనాలి: ఎర్రబెల్లివరంగల్​ అర్బన్​జిల్లా : ఎలాంటి ష‌ర‌తులు లేకుండా ప‌త్తి పంట‌ను సీసీఐ కొనుగోలు చేయాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు డిమాండ్ చేశారు. ప‌త్తి పంట‌ కొనుగోలుపై కొత్త‌గా సీసీఐ ష‌ర‌తులు విధిస్తూ జీవో విడుద‌ల చేయడాన్ని ఆదివారం మంత్రి తీవ్రంగా ఖండించారు. ఈ మేర‌కు సీసీఐ చైర్మన్ అండ్​ మేనేజింగ్ డైరెక్టర్ కు మంత్రి లేఖ రాశారు. ఇప్ప‌టికే అకాల వ‌ర్షాలు, తుఫాన్ల‌తో అత‌లాకుత‌ల‌మై న‌ష్టాల పాలైన రైతుల‌కు శ‌రాఘాతంగా మ‌రికొన్ని నిబంధ‌న‌ల‌ను విధిస్తూ సీసీఐ కొత్త జీవో తేవ‌డాన్ని ఎర్ర‌బెల్లి విమ‌ర్శించారు. కనీస మ‌ద్ద‌తు ధ‌ర‌తో రైతుల‌ను ఆదుకోవాల్సిన స‌మ‌యంలో అర్థం ప‌ర్థం లేని కొత్త నిబంధ‌న‌ల‌తో మ‌రింత‌గా రైతుల‌ను ఇబ్బందులు పెట్టొద్ద‌న్నారు. తెలంగాణ‌లో అత్య‌ధికంగా రైతులు ప‌త్తిని సాగు చేశార‌ని తుఫాన్లు వారిని న‌ట్టేటా ముంచాయ‌న్నారు. ఈ ద‌శ‌లో వారు తెచ్చిన ప‌త్తిని ఎలాంటి ష‌ర‌తులు లేకుండా కొనుగోలు చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. వీలైతే మ‌ద్ద‌తు ధ‌ర‌ను పెంచాల‌ని కోరారు. ఒక‌వైపు తెలంగాణ రాష్ట్రం రైతుల‌కు అనేక ప్రోత్సాహ‌కాలు అందిస్తూ రైతాంగాన్ని ఆదుకుంటుంటే అందుకు భిన్నంగా సీసీఐ నిబంధ‌న‌లు రైతుల‌కు ఇబ్బందులు పెట్టేలా ఉన్నాయ‌ని మంత్రి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సీసీఐ జారీ చేసిన జీవోతో రైతుల్లో వ్య‌వ‌సాయం, ప‌త్తి పంట సాగుపై ఆస‌క్తి త‌గ్గేలా ఉన్నాయ‌ని అన్నారు. రైతుల‌ను ఆదుకోవాల‌ని కోరారు.