బీజేపీతోనే మార్పు సాధ్యం: కిషన్ రెడ్డి

బీజేపీతోనే మార్పు సాధ్యం: కిషన్ రెడ్డిజనగామ జిల్లా: నూతన వ్యవసాయ చట్టాలపపై ఒక పంజాబ్ రాష్ట్రం తప్ప ఎవ్వరు తప్పు పట్టడం లేదని, కావాలని కొన్ని రాజకీయ పార్టీలు రైతుల్లో దురభిప్రాయం కల్పిస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరిన కిషన్ రెడ్డిని మార్గం మధ్యలో జనగామ జిల్లా బీజేపీ అధ్యక్షులు దశమంత రెడ్డి, జిల్లా బీజేపీ నాయకులు ఘనంగా స్వాగతించారు. అనంతరం జనగామ జిల్లా అధ్యక్షులు దశమంత రెడ్డి నివాసంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.కేంద్రమంత్రి అయ్యాక వరంగల్ కి రాలేదని, ప్రత్యేకంగా భద్రకాళి అమ్మవారి దర్శనం కోసమే వరంగల్ పర్యటన పెట్టుకున్నామని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఇందుకు నిదర్శనమే మొన్నటి దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను కిషన్ రెడ్డి గుర్తుచేశారు. బీజేపీతో తెలంగాణలో మార్పు సాధ్యమని, కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతిని ఎండగట్టేందుకు ప్రజలు సిద్ధమయ్యారని ఆయన హెచ్చరించారు.ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజల్ని సంఘటితం చేసి ముందుకెళ్తామని రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.