కాంగ్రెస్​ నుంచి శివసేనలోకి ఊర్మిళ?

కాంగ్రెస్​ నుంచి శివసేనలోకి ఊర్మిళ?ముంబై: కాంగ్రెస్​ మాజీ నాయకురాలు , ప్రముఖ బాలీవుడ్​ నటి ఊర్మిళా మంటోడ్కర్​ పార్టీ మారనున్నారు. సోమవారం శివసేస పార్టీలోకి చేరనున్నట్లు సమాచారం. 2019 ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్​ తరపున నార్త్​ ముంబై నుంచి పోటీ చేసిన ఆమె బీజేపీ సీనియర్​ నేత గోపాల్​ చినయ్య చేతిలో ఓటమి చవిచూశారు. 2019 మార్చిలో కాంగ్రెస్​ సభ్యత్వం తీసుకున్న ఆమె అదే సంవత్సరం సెప్టెంబర్​లో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కాంగ్రెస్​లోని రాజకీయాల కారణంగానే పార్టీకి దూరం అవుతున్నట్లు ఆమె వివరించారు. పార్టీలో పెద్ద లక్ష్యంతో పనిచేయడానికి బదులు అంతర్గత రాజకీయాలు , పార్టీలోని స్వార్థ ప్రయోజనాలతో పోరాటం చేయడం కష్టంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబై కాంగ్రెస్​ చీఫ్​ మిలింద్​ దేవరాతో తాను పంచుకున్న విశ్వసనీయ సమాచారం కూడా బహిర్గతం కావడంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముంబైలో తన ఓటమికి పార్టీలోని కొన్ని శక్తులు పనిచేశాయని విమర్శించారు. అయితే నాటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఈ బాలీవుడ్​ ముద్దుగుమ్మ సోమవారం నుంచి కొత్త రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. శాసన మండలికి ఊర్మిళ నామినేట్..​చాలాకాలం నుంచి ఊర్మిళా శివసేనలో చేరుతారనే చర్చ మహారాష్ట్రలో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో శివసేన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఆమెను మండలికి నామినేట్​ చేయనున్నట్లు సమాచారం. ఇటీవల ప్రభుత్వం ఆమె పేరును గవర్నర్​ భగత్సింగ్​ కొష్యారికి పంపింది. ఈక్రమంలోనే ఆమె శివసేనలోకి చేరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.