టీడీపీ సభ్యుల ఒక రోజు సస్పెన్షన్​

అమరావతి: టీడీపీ సభ్యులను స్పీకర్‌ అసెంబ్లీ నుంచి ఒకరోజు పాటు సస్పెండ్‌ చేశారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించిన చంద్రబాబుతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు, బాల వీరాంజనేయులు, నిమ్మల రామానాయుడు, సాంబశివరావు, ఆదిరెడ్డి భవాని, గద్దె రామ్మోహన్, మంతెన రామరాజు, అచ్చెన్నాయుడు, బీ అశోక్‌, పయ్యావుల కేశవ్‌, వెలగపూడి రామకృష్ణ బాబు, బుచ‍్చయ్య చౌదరి, జోగేశ్వరరావు, సత్యప్రసాద్‌ సస్పెండయ్యారు. సభ నుంచి బైటకు వచ్చి అసెంబ్లీ ప్రధాన ద్వారం ఎదుట చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. వ్యవసాయరంగంపై చర్చ సందర్భంగా మంత్రి కన్నబాబు సభ ముందు పూర్తి వివరాలు ఉంచారు. మంత్రి ప్రసంగం ముగిసిన తర్వాత మాట్లాడేందుకు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడికి స్పీకర్‌ అవకాశం ఇచ్చారు. టీడీపీ సభ్యుల ఒక రోజు సస్పెన్షన్​అయితే టీడీపీకే చెందిన పయ్యావుల కేశవ్‌ రామానాయుడు మాట్లాడకుండా అడ్డుపడ్డారు. ఈ క్రమంలో స్పీకర్​ జోక్యం చేసుకుని టీడీపీకే చెందిన సభ్యుడిని మాట్లాడకుండా అడ్డుకోవడం సబబు కాదని కేశవ్‌కు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌ జోక్యం చేసుకుని వివరణ ఇచ్చారు. టీడీపీ సభ్యులు అవగాహన లేకుండా మాట్లాడడం సమంజసం కాదని అన్నారు. ఆ తర్వాత కూడా టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు. అయితే పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లుపై చర్చించకుండా ఆమోదించినందుకు నిరసనగా వారు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. వ్యవసాయం రంగంపై చర్చ కావాలని వాయిదా తీర్మానం ఇచ్చిన టీడీపీ సభ్యులే అదే అంశంపై చర్చ జరుగుతుంటే వాకౌట్ చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదే అంశంపై మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. టీడీపీకి అమరావతి రైతులే తప్ప మిగతా రైతులు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబులా నటించడం తమ ముఖ్యమంత్రికి రాదని టీడీపీకి చురక అంటించారు. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్‌ నెరవేరుస్తున్నారని చెప్పారు.