మార్స్‌‌పై నీటి జాడలు కనిపెట్టిన రోవర్

మార్స్‌‌పై నీటి జాడలు కనిపెట్టిన రోవర్

వరంగల్ టైమ్స్,టాప్ స్టోరి : మార్స్‌పై నీరు ఉందా లేదా అనే అంశంపై ఏళ్లుగా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ రహస్యాన్ని బట్టబయలు చేసేందుకు ఆ గ్రహంపైకి వెళ్లిన క్యూరియోసిటీ రోవర్ ఓ ఆసక్తికరమైన విషయం తెలిపింది. అదేంటో తెలుసుకుందాం..మార్స్‌‌పై నీటి జాడలు కనిపెట్టిన రోవర్అంగారక గ్రహం పై నీరు ఉండి ఉంటే గనుక ఈ భూమిపై ఉన్న ధనవంతుల్లో చాలా మంది ఈ పాటికి మార్స్ ట్రిప్స్ వేసి వచ్చేవారే. కానీ ఆ నీరే ఊరిస్తోంది. ఉన్నట్లు కనిపిస్తూ, ఎక్కడుందో తెలియట్లేదు. ఈ క్రమంలోనే మార్స్ గ్రహ ఉపరితలంపై తిరుగుతూ ఉన్న క్యూరియోసిటీ రోవర్ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. నీటి జాడల ఆనవాళ్లను గుర్తించింది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ తాజాగా ఓ ట్వీట్ చేసింది. దాని ప్రకారం క్యూరియోసిటీ రోవర్ ఇప్పుడు ఉన్న ప్రదేశంలో ఒకప్పుడు ఓ సరస్సు ఉండేది. అది ఎండిపోయింది. ఆ సరస్సు ఉండేది అని గుర్తించేందుకు వీలుగా అక్కడి నేల ఉంది. అందుకు సంబంధించి క్యూరియోసిటీ తీసిన ఫొటోను నాసా రిలీజ్ చేసింది.

ప్రస్తుతం క్యూరియోసిటీ తిరుగుతున్న ప్రదేశాన్ని ‘సల్ఫేట్-బేరింగ్ యూనిట్’ అని పిలుస్తున్నారు. ఇది వరకు శాస్త్రవేత్తలు ఆ ప్రదేశాన్ని పొడి ప్రదేశంగా భావించారు. అక్కడ ఏ సరస్సూ లేదు అనుకున్నారు. కానీ కొత్త ఫొటోని బట్టీ అక్కడ సరస్సు ఉండేది అని అత్యంత స్పష్టంగా తేలింది. మరైతే ఆ ద్రవం ఏమైంది? ఎటుపోయింది? ఈ ‘సల్ఫేట్ బేరింగ్ యూనిట్’ ప్రదేశం షార్ప్ (Mt.Sharp) అనే ఎత్తైన పర్వతానికి దగ్గర్లో ఉంది. ఇది వరకు ఈ పర్వతాన్ని ఎక్కిన క్యూరియోసిటీ రోవర్ అక్కడి నుంచి దిగువ ప్రదేశాన్ని చూసింది. ఆ తర్వాత అక్కడికి వెళ్లింది. అక్కడి నుంచి పంపినదే ఈ తాజా ఫొటో. ఇప్పుడు మీరు చూస్తున్నవి ఆ ఫొటోలో భాగమే.

మేము ఈ మొత్తం పరిశోధనలో చూసిన నీటి అలలకు సంబంధించిన ఉత్తమ సాక్ష్యం ఇదని క్యూరియోసిటీ ప్రాజెక్ట్ సైంటిస్ట్ అశ్విన్ వాసవాడ తెలిపారు. అశ్విన్ కాలిఫోర్నియాలోని పసడేనాలో ఉన్నా, నాసాకి చెందిన జెట్ ప్రపల్షన్ ల్యాబొరేటరీలో పనిచేస్తున్నారు. “ఇప్పటివరకూ మేము క్యూరియోసిటీని వేల అడుగులు ఎక్కించాము. ఎక్కడా ఇలాంటి సాక్ష్యాన్ని చూడలేదు” అని అశ్విన్ తెలిపారు. వందల కోట్ల సంవత్సరాల కిందట ఆ ప్రదేశంలో తక్కువ నీటితో ఓ సరస్సు ఉండేది. సరస్సు అడుగు భాగంలో సున్నపురాయి మెత్తగా మారింది. ఆ రాతికి నీటి అలలు కంటిన్యూగా తగిలేవి. తద్వారా అలలు వచ్చినట్లుగా ఆకారం ఏర్పడింది” అని నాసా తెలిపింది.

అలల లాగా కనిపిస్తున్న ప్రదేశానికి ఇప్పుడు మార్కర్ బ్యాండ్ అని నిక్‌నేమ్ పెట్టారు. అక్కడ ఓ రకమైన నల్లటి రాయి ఉంది. అది మిగతా షార్ప్ పర్వత రాయికి భిన్నంగా ఉంది. తన పరిశోధనలో క్యూరియోసిటీ రోవర్ కొన్ని రాళ్ల నుంచి శాంపిల్స్ సేకరించింది. ఇందుకోసం డ్రిల్లింగ్ చేసింది. ఆ డ్రిల్లింగ్‌ని బట్టీ ఆ రాళ్లన్నీ గట్టిగానే ఉన్నట్లు నాసా గుర్తించింది. 2014 నుంచి క్యూరియోసిటీ రోవర్ 5 కిలోమీటర్ల ఎత్తున్న షార్ప్ పర్వతానికి దగ్గర్లో తిరుగుతోంది. ఒకప్పుడు ఈ పర్వతం దగ్గర సరస్సులు, నీటి ప్రవాహాలు ఉండేవి అని భావిస్తున్నారు. అందువల్ల ఇక్కడ జీవులు జీవించాయా అనే అంశాన్ని పరిశోధిస్తున్నారు. ఐతే అప్పట్లో ఉండే నీరు ఆ తర్వాత ఏమైపోయింది ? అనే ప్రశ్నకు ఇంకా సమాధానం లభించలేదు.