ఒకే నెలలో రూ.12 వేల కోట్లకు పైగా అప్పు
వరంగల్ టైమ్స్, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం ఒక్క జనవరిలోనే దాదాపు రూ.12,000 కోట్లకుపైగా రుణాలను సమీకరించింది. కేంద్ర ఆర్థికశాఖ చివరి 3 నెలలకు ఇచ్చిన అనుమతి మొత్తాన్ని ఒకే నెలలో వాడేసుకుంది. రిజర్వు బ్యాంకు మంగళవారం నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో ఏపీ ప్రభుత్వం 2 రూపాల్లో రుణం తీసుకుంది. రూ.1,000 కోట్లు 13ఏళ్ల కాల పరిమితితో తిరిగి చెల్లించేలా తీసుకుంది. దీనికి 7.71 శాతం వడ్డీ. 9ఏళ్ల కాల పరిమితితో తీర్చేలా మరో రూ.557 కోట్లు తీసుకుంది.
దీనికి వడ్డీ 7.66 శాతం. మంగళవారం నాటి రుణంతో ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుంచి జనవరిలోనే రూ.4,557 కోట్ల రుణం తీసుకున్నట్లయింది. జనవరి మొదటి వారంలో కేంద్రం అనుమతులు ఇవ్వగా నెలాఖరుకల్లా మొత్తం రుణం తెచ్చేసుకుని వాడుకోవాల్సిన పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఉంది. వివిధ కార్పొరేషన్ల నుంచి ప్రభుత్వం రుణాలను తీసుకుంది.
ఇలా దాదాపు రూ.5,000 కోట్లు ఖజానాకు చేరాయని సమాచారం. ఇవికాక మరో కార్పొరేషన్‌కు సంబంధించి తీసుకున్న రుణం రూ.2,700 కోట్లు ఖజానాకు చేరాయని విశ్వసనీయ సమాచారం. దీంతో జనవరిలోనే మొత్తం రూ.12,000 కోట్లకు పైగా రుణాలు వినియోగించుకున్నట్లు లెక్కిస్తున్నారు. ఎనర్జీ కార్పొరేషన్‌కు ఎప్పటి నుంచో బకాయిలున్న మొత్తం ఈ రుణం నుంచే రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉంది. ఇది చెల్లించారా లేదా అనేది ఇంకా తెలియలేదు. ప్రస్తుతం రాష్ట్రం ఇంకా కొంత ఓవర్ డ్రాఫ్ట్‌లోనే ఉన్నట్లు తెలిసింది.