దళితులకు అండగా దళిత బంధు : మంత్రి సత్యవతి

దళితులకు అండగా దళిత బంధు : మంత్రి సత్యవతి

వరంగల్ టైమ్స్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా : ఈ దేశంలో దళిత, గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం పెట్టిన పథకాలను తీసేసిన చరిత్ర లేదని రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపి వారి పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించేందుకు సీఎం కేసీఆర్ దళిత బంధు తెచ్చారని ఆమె అన్నారు. భూపాలపల్లి జిల్లా, ఇల్లందు క్లబ్బులో జిల్లా ఎస్సీ కులాల సహకార సంఘం ఆధ్వర్యంలో నేడు ఏర్పాటు చేసిన దళిత బంధు అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దళితులకు అండగా దళిత బంధు : మంత్రి సత్యవతిదళిత లబ్దిదారులు దళిత బంధు కింద వచ్చిన మొత్తంతో లాభసాటి వ్యాపారాలు చేసి గొప్పగా ఎదగాలని మంత్రి సూచించారు. మార్కెట్లో దేనికి డిమాండ్ ఉందో గుర్తించి ఆ వ్యాపారాలు చేయాలని అన్నారు. మన పక్కన ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అముల్ నుంచి లక్ష లీటర్ల పాలు కొంటుంది. ప్రతీ నెల వందల కోట్ల టర్నోవర్ ఉంది. కర్ణాటక డైరీ నుంచి 20 లక్షల లీటర్ల పాలను మహిళా శిశు సంక్షేమ శాఖ కోసం తీసుకుంటున్నాం. పాలకు అంత డిమాండ్ ఉంది. ఇలా నిత్యావసరాలకు ఉన్న డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది. దళిత బంధు కింద ఇచ్చే పది లక్షల యూనిట్ ను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు.

సాధారణంగా లోన్ ఉంటే భయం ఉంటుంది. నాకు కూడా లోన్ ఉంది. నెల నెలా కడతాను. దళిత బంధు పథకం కింద ఇచ్చే పది లక్షల రూపాయిలను వడ్డీతో తెచ్చామని అనుకుని పని చేస్తే మీరు విజయవంతమవుతారని తెలిపారు.మన శ్రమ, నిజాయతీ జోడించి పని చేయాలని మంత్రి సూచించారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల మనం మూడు తరాలు వెనక్కి పోయాం. దీనిని మార్చాలనే గొప్ప సంకల్పముతో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం తెచ్చారు. ప్రజలు అవకాశం ఇస్తే వచ్చే 6,7 ఏళ్లలో దళిత బంధు పథకం ద్వారా ప్రతీ దళితునికి 10 లక్షల రూపాయలు ఇచ్చి పథకాన్ని పూర్తి చేస్తాను అని సీఎం చెప్పారని ఆమె గుర్తు చేశారు.

దళిత బంధు పథకం పెట్టే ముందు చర్చలు జరిగినప్పుడు ఇంకా కూడా వెనుకబడ్డ దళితులను ముందుకు తీసుకు రాకపోతే వారికి ఈ రాజ్యం, రాజ్యాంగం పట్ల నమ్మకం పోతుంది కాబట్టి అలా జరుగొద్దు అని సీఎం కేసిఆర్ అన్నారు. ప్రజల అవసరాలు తెలిసిన వ్యక్తి మనకు సీఎం కావడం మన అదృష్టం. ఆయనకు మరింత శక్తిని ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రా, జిల్లా అధికారులు, నేతలు, దళిత బంధు లబ్ది దారులు పాల్గొన్నారు.