ఈటెల వర్సెస్ వివేక్? 

ఈటెల వర్సెస్ వివేక్?

ఈటెల వర్సెస్ వివేక్? 

వరంగల్ టైమ్స్, టాప్ స్టోరీ : బీజేపీలో కొనసాగుతున్న పాతమిత్రులు ఈటెల రాజేందర్, వివేక్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నదా? ఇద్దరూ ఢీ అంటే ఢీ అంటున్నారా? ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆగ్రహంగా ఉన్నారా? అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. ఇద్దరి మధ్య కోల్డ్ వార్ తారాస్థాయికి చేరిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

* జోరు పెంచిన ఈటెల..
బీజేపీలో ఈ మధ్య ఈటెల రాజేందర్ జోరు పెంచారు. హైకమాండ్ తో ఆయన డైరెక్టుగా టచ్ లోకి వచ్చాడన్న వార్తలొస్తున్నాయి. అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్ లాంటి వారితో ఈటలకు సన్నిహిత సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హుజూరాబాద్ లో ఆయన సాధించిన విజయంతో బీజేపీ అగ్రనేతలు ఫుల్ ఫిదా అయ్యారట. కాబట్టి ఈటెలకు సదరు అగ్రనేతలు ప్రాధాన్యత ఇస్తున్నట్లు టాక్. ఆయనకు ఇస్తున్న ఈ ఇంపార్టెన్స్ చూసి బీజేపీలోని ఇతర నాయకుల్లో కొంత అభద్రతాభావం కూడా నెలకొందని సమాచారం. అందుకే బండి సంజయ్, వివేక్ లాంటి వారు ఈటెలతో దూరందూరంగా ఉంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈటెలకు రాజకీయంగా పలుకుబడి బాగానే ఉంది. అయితే వివేక్ కూడా ఆస్థాయిలో కాకపోయినా ఆర్థికంగా స్ట్రాంగ్ గానే ఉన్నారు. పైగా బలమైన మీడియా చేతిలో ఉంది. బండి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లాంటి వారితో ఆయనకు సాన్నిహిత్యం ఉంది. మాజీ ఎంపీ కావడంతో ఢిల్లీలో కొన్ని పరిచయాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వివేక్ కూడా రాష్ట్ర బీజేపీలో కీలకంగా పనిచేస్తున్నారు. బండి సంజయ్ కు ఆప్తుడిగానూ పేరు తెచ్చుకున్నారు.

*ఈటెలతో బండి, వివేక్ ల కటీఫ్ ఎందుకు?
ఈటెల రాజేందర్ కు పెద్ద పదవి వచ్చే అవకాశముందని జోరుగా ఊహాగానాలు వస్తున్నాయి. ఆ లీకుల నేపథ్యంలో బండి సంజయ్, వివేక్ లు ఈటెలతో కటీఫ్ చేసుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈటెల బీజేపీలో చేరిన కొత్తలో వివేక్ చాలా క్లోజ్ గా ఉన్నారు. ఒకరికొకరు సలహాలు కూడా ఇచ్చిపుచ్చుకున్నారు. కానీ ఎప్పుడైతే బండి సంజయ్, ఈటెల మధ్య దూరం పెరిగిందన్న వార్తలొచ్చాయో అప్పటి నుంచి వివేక్ కూడా ఈటెలకు కటీఫ్ చెప్పినట్లు సమాచారం. అంతేకాదు ఇటీవల వివేక్, ఈటెల మధ్య డైలాగ్ కూడా జరిగిందని ప్రచారం జరుగుతోంది. వివేక్, ఈటెల నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారని కూడా టాక్. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లాంటి వారి దృష్టికి ఇద్దరు నేతల పంచాయితీ వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి ఇద్దరూ ఏమీ మాట్లాడలేదని సమాచారం.

*వాళ్లిద్దరూ బలమైన నాయకులే..
వివేక్, ఈటెలు ఇద్దరూ బలమైన సామాజికవర్గాలకు చెందిన వారు. రాజకీయంగానూ బలమైన నాయకులు. కాబట్టి ఇద్దరిలో ఏ ఒక్కరి సైడ్ తీసుకున్నా కష్టమనుకున్నారో ఏమో కానీ ఇద్దరూ సైలైంట్ గానే ఉండిపోయారట. అయితే బండి సంజయ్ మాత్రం వివేక్ నే సపోర్ట్ చేస్తూ మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి ఈటెల రాజేందర్ కొంత నొచ్చుకున్నట్లు టాక్.

ఈటెల, వివేక్ లొల్లి హైకమాండ్ దృష్టికి వెళ్లినట్లు సమాచారం. పార్టీ పెద్దలు ఇద్దరు నేతలకు క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. సీనియర్ నాయకులు కూడా గల్లీ స్థాయి లీడర్లలా కొట్లాడుకోవడమేంటని సీరియస్ అయినట్లు టాక్. మొత్తానికి ఈటెల, వివేక్ లొల్లి రాష్ట్ర బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు నేతల లొల్లి చూసి బీజేపీలో ఇదేం కొత్త పంచాయితీ అని క్యాడర్ కూడా ముక్కున వేలేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.