ఆర్టీసీకి ఒక్క రోజులో రికార్డు స్థాయి ఆదాయం

ఆర్టీసీకి ఒక్క రోజులో రికార్డు స్థాయి ఆదాయం

వరంగల్ టైమ్స్, విజయవాడ : ఏపీఎస్ ఆర్టీసీ మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి ఆదాయాన్ని నమోదు చేసింది. ఈనెల 18న ఒక్క రోజులో రూ.23 కోట్ల ఆదాయాన్ని సాధించి ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో అత్యధిక ఎర్నింగ్స్ సాధించిన రోజుగా రికార్డు నెలకొల్పింది. దీనికి ముఖ్య కారణమైన ప్రయాణికులకు ఆర్టీసీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. సాధారణంగా ప్రతీ యేడాది సంక్రాంతి సీజన్లో రికార్డు స్థాయి ఆదాయం నమోదవుతుంది. కానీ ఈ సంవత్సరం సాధించిన ఈ ఘనతకు ప్రత్యేకత ఉందనే చెప్పాలి.

ఎందుకంటే గత సంవత్సరాల మాదిరి టిక్కెట్ల రేట్లు 50 శాతం అదనంగా పెంచలేదు. ప్రయాణికులు విశేషంగా ఆదరించడంతో సాధారణ ఛార్జీలతోనే ఈ ప్రత్యేక బస్సులన్నీ నడపబడ్డాయి. సాధారణ ఛార్జీలతో ప్రత్యేక బస్సులు నడిపితే ప్రయాణీకులు ఆదరిస్తారనడానికి ఇదొక నిదర్శనం. ఈ సంక్రాంతికి ప్రయాణికులు వారి యొక్క ప్రయాణ వ్యయ భారాన్ని తగ్గించుకునేందుకు ఏపీఎస్ఆర్టీసీ బస్సులనే ఎంచుకున్నారు. ఇతర ప్రైవేటు వాహనాలు మరియు సొంత వాహనాల కంటే ఆర్టీసీకే మొగ్గు చూపారు.ఆర్టీసీకి ఒక్క రోజులో రికార్డు స్థాయి ఆదాయంకాగా ఈ సంక్రాంతి సమయంలో కార్గో ద్వారా కూడా సరాసరిన ఒక రోజు ఎక్కువ ఆదాయం నమోదు చేయబడింది. ఒక్క రోజులో రూ.55 లక్షలు సాధించింది. అంతకు ముందు ఒక రోజు ఆదాయం రూ.45 లక్షలుగా రికార్డులో ఉంది. దాన్ని అధిగమించింది. ప్రయాణికులకు ముందస్తుగా బస్సులను అందుబాటులో ఉంచడం, నిర్వహణకు అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించడం, సమర్ధవంతంగా నిర్వహించడంతో పాటు ఎప్పటికప్పుడు బస్సులను పర్యవేక్షించడం, ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేయడం వల్లనే ఆర్టీసీ రికార్డు స్థాయి ఆదాయం సాధించగలిగింది.

 

సంస్థలోని సిబ్బంది ముఖ్యంగా డ్రైవర్లు, కండక్టర్ల అంకితభావం, వారియొక్క కృషి ఫలితంగానే ఈ సంక్రాంతి ప్రత్యేక సమయంలో ఈ ఘనత ఆర్టీసీ సాధించింది. అంతేకాకుండా పర్యవేక్షణలో అధికారుల సహాయసహకారాలు కూడా కొనియాడదగినవి. కార్గో పట్ల ప్రత్యేక సర్వీసుల పట్ల ప్రయాణికులు చూపించిన ఆదరణ ఏపీఎస్ఆర్టీసీ ఎప్పటికీ మరువలేనిది. మున్ముందు కూడా ఇదే ఆదరణ ఆర్టీసీ పట్ల చూపిస్తారని పూర్తిగా విశ్వసిస్తూ, మరొక్కసారి ఆదరించిన ప్రయాణికులందరికీ ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.