బిల్లులు రద్దు చేసేవరకు పోరాటం

బిల్లులు రద్దు చేసేవరకు పోరాటంవిశాఖ జిల్లా : అన్నదాతలను మోసగించే బిల్లులను రద్దు చేసేంతవరకు కాంగ్రెస్ పోరాడుతుందని విశాఖ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సంకు వెంకటేశ్వర్​ రావు తెలిపారు. మంగళవారం నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా చేపట్టిన భారత్ బంద్ కు సంఘీభావం తెలుపుతూ జగదాంబ కూడలిలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన చేశారు. పరిసర ప్రాంతాల్లోని దుకాణదారులు షాపులు మూసి మద్దతు తెలపాలని కాంగ్రెస్ నాయకులు అభ్యర్థించారు. రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న మోడీ తన తప్పును సరిదిద్దుకోవాలని కోరారు. కేవలం అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ శక్తులకు మాత్రమే ఈ బిల్లులు లబ్ధి చేకూరుస్తాయని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతువ్యతిరేక బిల్లులను ఉపసంహరిస్తామని రాహుల్ గాంధీ ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అన్నదాతల పట్ల మోడీ ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీఏ నారాయణరావు అన్నారు. ఈ నిరసనలో రాష్ట్ర బీసీ.సెల్ వైస్ చైర్మన్ మూల వెంకట రావు, ఇంటాక్ అధ్యక్షుడు తమ్మిన నాయుడు తదితరులు పాల్గొన్నారు.