మాజీ కేంద్ర మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత

మాజీ కేంద్ర మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సోషలిస్ట్ నేత శరద్ యాదవ్ (75) కన్నుమూశారు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నశరద్ యాదవ్ నిన్న ఢిల్లీలోని తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను గురుగ్రామ్‌లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు తరలించారు. అపస్మారక స్థితిలో ఆయనను ఆసుపత్రికి తీసుకొచ్చినట్టు వైద్యులు తెలిపారు. పల్స్ కొట్టుకోకపోవడం, రికార్డు చేయదగిన బ్లడ్ ప్లజర్ లేకపోవడంతో వెంటనే ఆయనకు సీపీఆర్ చేశారు. ఆయనను బతికించేందుకు పలు ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో రాత్రి 10.19 గంటలకు ఆయన మరణించినట్టు ప్రకటించారు.మాజీ కేంద్ర మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత*విద్యార్థి నేతగా..
విద్యార్థి నేతగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన శరద్ యాదవ్.. కాంగ్రెస్‌ వ్యతిరేకిగా పేరు తెచ్చుకున్నారు. జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆయన తన జీవితంలో సుదీర్ఘకాలం పాటు ప్రతిపక్షంలో కీలక పాత్ర పోషించారు. అయితే, ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్, రాజకీయ ప్రత్యర్థి లాలు ప్రసాద్ యాదవ్‌తో సయోధ్య కుదుర్చుకున్నారు. 2015 బీహార్ ఎన్నికల తర్వాత మహాకూటమిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. శరద్ యాదవ్ అంతకుముందు ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి ప్రభుత్వంలో 1989లో వీపీ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. మూడుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, 7 సార్లు లోక్ సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

*కేంద్రమంత్రిగా..
శరద్ యాదవ్ అంతకుముందు అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో, 1989లో వీపీ సింగ్ ప్రభుత్వంలో శరద్ యాదవ్ కేంద్రమంత్రిగా సేవలు అందించారు. రాజ్యసభకు మూడుసార్లు ప్రాతినిధ్యం వహించిన ఆయన లోక్‌సభకు ఏడుసార్లు ఎన్నికయ్యారు. బీహార్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న జనతా దళ్ యునైటెడ్ (జేడీయూ) వ్యవస్థాపక అధ్యక్షుడు కూడా. మహాకూటమి నుంచి నితీశ్ కుమార్ బయటకు వచ్చి బీజేపీతో చేతులు కలపడంతో శరద్ యాదవ్ పార్టీని వీడాడు. జేడీయూ నుంచి బయటకు వచ్చిన తర్వాత శరద్ యాదవ్ 2018లో లోక్ తాంత్రిక్ జనతా దళ్ పేరుతో సొంత పార్టీ ఏర్పాటు చేశారు. రెండేళ్ల తర్వాత లాలు ప్రసాద్ యాదవ్ సారథ్యంలోని రాష్ట్రీయ జనతా దళ్ (జేడీయూ)లో విలీనం చేశారు.

*ప్రముఖుల సంతాపం..
శరద్ యాదవ్ మృతికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు. సుదీర్ఘ ప్రజా జీవితంలో ఎంపీగా, మంత్రిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. డాక్టర్ లోహియా భావజాలం నుంచి ప్రేరణ పొందారని అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు.

శరద్ యాదవ్ తన రాజకీయ సంరక్షకుడని బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ పేర్కొన్నారు. తాను ఉప ముఖ్యమంత్రిని కావడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారని, ఈ విషయాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. శరద్ యాదవ్ మృతి వార్త తనను బాధించిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు. సింగపూర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లాలు ప్రసాద్ యాదవ్ ఓ వీడియో మెసేజ్ విడుదల చేస్తూ.. తనకు, శరద్ యాదవ్‌కు మధ్య భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ అవెప్పుడూ తమ మధ్య శత్రుత్వానికి కారణం కాలేదని అన్నారు.