శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పుల్లో నలుగురు ముష్కరులు హతమయ్యారు. జమ్ము జిల్లాలోని బాన్ టోల్‌ప్లాజాలో ఇవాళ ఉదయం 5 గంటలకు ఎన్‌కౌంటర్ మొదలైంది. ఈరోజు తెల్లవారుజామున జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై నగరోటా వద్ద ఉన్న బాన్ టోల్‌ప్లాజాలో వాహనాలను తనిఖీ చేస్తుండగా, ఓ బస్సులో ఉన్న ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులకు పాల్పడ్డారు. దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు దిగారని జమ్ము ఎస్పీ శ్రీధర్ పాటిల్ చెప్పారు. ఈ ఆపరేషన్‌లో సైనికులు కూడా పాల్గొన్నారని, ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందినట్లు తెలిపారు. ఎన్‌కౌంటర్ సందర్భంగా జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిని భద్రతాదళాలు మూసివేశాయి. నగ్రోటా చెక్‌పోస్ట్ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నది.