హైదరాబాద్: 2021 నూతన సంవత్సరం మొదటి వారం నుంచి హైదరాబాద్ నగర ప్రజలకు ఉచిత తాగునీటి సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరబాద్ జలమండలి ద్వారా 20 వేల లీటర్ల వరకు తాగునీటిని ఉచితంగా సరఫరా చేస్తామన్నారు. ఇందుకు కావాల్సిన కార్యాచరణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, జలమండలి అధికారులతో ప్రగతిభవన్ లో మంత్రి కేటీఆర్ సుదీర్ఘంగా సమీక్షించారు. ఉచిత తాగునీటి సరఫరాకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లను, రానున్న రెండు వారాల్లో పూర్తి చేయాలని జలమండలి అధికారులను కేటీఆర్ ఆదేశించారు. ఉచిత తాగునీటి సరఫరాకు సంబంధించిన సమాచారం ప్రజలకు సంపూర్ణంగా చేరేలా జలమండలి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులకు కేటీఆర్ పలు సూచనలు చేశారు. జలమండలి ద్వారా నగరంలో జరుగుతున్న నీటిసరఫరా విధానాన్నిఈ సందర్భంగా మంత్రి పరిశీలించారు. గత కొన్నేండ్లుగా నగరంలో తాగునీటి అవసరాలు పెరుగుతున్నాయని, అందుకు అనుగుణంగా సామర్థ్యాన్ని ప్రతీ యేడు పెంచుతున్నట్లు అధికారులు కేటీఆర్ కు వివరించారు. వచ్చే యేడాది వేసవిలో సరిపడా నీటిని సరఫరా చేసేందుకు ఇప్పటినుంచే తగిన ప్రణాళిక రూపొందిస్తున్నట్లు అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులందరూ కృషి చేయాలని కేటీఆర్ కోరారు.
Home News