కొత్త సచివాలయం నిర్మాణ పూర్తి వివరాలు

కొత్త సచివాలయం నిర్మాణ పూర్తి వివరాలుహైదరాబాద్‌: తెలంగాణ ప్రతిష్ఠ, చరిత్ర, వైభవానికి అద్దంపట్టేలా కొత్త సచివాలయం నిర్మాణం కానున్నది. దీనికి సంబంధించిన తుది డిజైన్లకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ‘అర్కిటెక్టులు ఆస్కార్‌, పొన్నితోపాటు ఇంజినీర్స్‌ సత్యవాణి ప్రాజెక్ట్స్‌ అండ్‌ కన్సల్టేషన్‌ ఈ డిజైన్‌ను రూపొందించారు. మొత్తం 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, 7 అంతస్తుల్లో సచివాలయాన్ని నిర్మించనున్నారు. గతంలో 6 అంతస్తుల్లో నిర్మించాలని భావించినా.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని డిజైన్‌లో మార్పులు చేశారు. తాజా డిజైన్‌ ప్రకారం.. 7 అంతస్తులకు పైన భవనం మధ్య భాగంలో సెంట్రల్‌ టవర్‌ ఉంటుంది. ఇందులో మరో నాలుగు అంతస్తులు ఉంటాయి. ఒక్కో అంతస్తు 14 అడుగుల ఎత్తుతో ఉంటుంది. సెంట్రల్‌ టవర్‌పై 48 అడుగుల ఎత్తుతో తూర్పు, పడమరవైపు ‘స్కైలాంజ్‌’లు నిర్మించనున్నారు. వీటిపైన 50 అడుగుల ఎత్తుతో గుమ్మటం (డోమ్‌) ఉంటుంది. ఈ డోమ్‌పై 11 అడుగుల ఎత్తుతో జాతీయ చిహ్నాన్ని ఏర్పాటు చేస్తారు.

ఉపరితలం నుంచి జాతీయ చిహ్నం వరకు భవనం ఎత్తు: 278 అడుగులు.
భవనం పొడవు, వెడల్పులు: 600×300 అడుగులు.
సచివాలయం మొత్తం విస్తీర్ణం: 27.5 ఎకరాలు
భవనం, ఇతర వసతుల కోసం వినియోగించేది: 23.5 ఎకరాలు.
చుట్టూ రోడ్ల కోసం: 3 ఎకరాలు
భవనానికి 9.7 శాతమే
భవనం విస్తీర్ణం: 2.4 ఎకరాలు (మొత్తం స్థలంలో 9.7%)
ల్యాండ్‌ స్కేపింగ్‌: 12 ఎకరాలు (50%)
అంతర్గత రోడ్లు, ఫుట్‌పాత్‌లు: 6 ఎకరాలు (25%)
పార్కింగ్‌: 3.7 ఎకరాలు (15.3%) (650 కార్లు, 500 బైక్‌లు పార్క్‌ చేయవచ్చు)
సెంట్రల్‌ కోర్ట్‌యార్డ్‌ లాన్‌: 2.2 ఎకరాలు (9%)
భవనంలో..
ఏడు ఫ్లోర్లు + లాబీలు: 6 లక్షల చదరపు అడుగులు
సెంట్రల్‌ టవర్‌లోని మీటింగ్‌ హాళ్లు, స్కైలాంజ్‌: 52 వేల చదరపు అడుగులు
ఇతర సౌకర్యాలు: 48వేల చదరపు అడుగులు
మొత్తం: 7 లక్షల చదరపు అడుగులు
సకల వసతులు
ఉద్యోగుల కోసం ప్రతి అంతస్తులో భోజన గది.
రికార్డులు, సెక్యూరిటీ, హౌస్‌కీపింగ్‌, బిల్డింగ్‌ మేనేజ్‌మెంట్‌ వంటి విభాగాలకు సరిపడా స్థలం.
సచివాలయం ఆవరణలో ఒక బ్యాంకు, ఏటీఎం, మందుల దుకాణం, పిల్లలు ఆడుకునే స్థలం, క్యాంటీన్‌, పెట్రోల్‌ బంక్‌, ఫైర్‌స్టేషన్‌, వెయిటింగ్‌ హాల్స్‌.
కొత్త దేవాలయం, మసీదు.