ఖాట్మండూ : నేపాల్‌లో రాజకీయ వివాదం తారాస్థాయికి చేరుకుంది. అధికార పార్టీలో తలెత్తిన వివాదాలు పార్లమెంటు రద్దుకు దారితీశాయి. దీంతో పార్లమెంటును రద్దు చేయాలంటూ చేసిన సిఫారసుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలో భేటీ అయిన మంత్రి మండలి చేసిన సిఫారసుకు అధ్యక్షురాలు, రాష్ట్రపతి విద్యాదేవి భండారి తాజాగా ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో నేపాల్‌లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 30, మే 10న పార్లమెంటు ఎన్నికలు జరగనున్నట్లు ప్రకటించారు. కాగా ప్రతిపక్షాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి.
ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలో భేటీ అయిన మంత్రి మండలి పార్లమెంటును రద్దుచేయాలంటూ మండలి అధ్యక్షురాలు విద్యాదేవీ భండారీకి సిఫారసు చేసింది. ఇవాళ ఉదయం అత్యవసర సమావేశం నిర్వహించిన మంత్రిమండలి ఈ మేరకు అనూహ్య నిర్ణయం తీసుకుంది. అధికార నేపాల్ కమ్యూనిస్టు పార్టీ (ఎన్‌సీపీ) లో కొంతకాలంగా తీవ్ర స్థాయిలో విభేదాలు కొనసాగుతున్నాయి. రెండు వర్గాలుగా విడిపోయి ప్రధాని పీఠం కోసం ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నాయి.