భారత్ లోకి మరో ప్రాణాంతక వ్యాధి

భారత్ లోకి మరో ప్రాణాంతక వ్యాధిహైదరాబాద్: కరోనాతో సతమతమవుతున్న భారత్ ను తాజాగా మరో ముప్పు వణికిస్తోంది. గుజరాత్‌లో తాజాగా మరో ప్రాణాంతక వ్యాధి తీవ్ర కలకలం రేపుతోంది. మ్యూకార్ మైకోసిస్ అనే అరుదైన ఫంగస్ వ్యాధి అహ్మదాబాద్‌లో కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే అహ్మదాబాద్‌లో 44 మంది ఈ వ్యాధి బారిన పడి ఆస్పత్రుల్లో చేరారు. వీరిలో 9 మంది చికిత్స పొందుతూ ఇప్పటికే మరణించారు. కరోనా బాధితుల్లో కనిపిస్తున్న ఒక అరుదైన ఫంగల్ ఇన్ఫెక్షన్ వారి కంటిచూపుతో పాటు ప్రాణాలను కూడా హరించి వేస్తోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్‌తో పాటు పలు నగరాల్లో మ్యూకార్ మైకోసిస్ వ్యాధి బాధితులు ఆస్పత్రుల్లో చేరుతుండడంతో ఇపుడు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. మ్యూకార్ మైకోసిస్ అనేది చాలా తీవ్రమైన, అరుదైన ఫంగల్ ఇన్‌ఫెక్షన్. మ్యుకోర్మిసెట్స్ అనే ఒకరకమైన ఫంగస్ వలన ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి ఎలాంటి వాతావరణంలోనైనా సంక్రమిస్తుంది. సాధారణంగా ముక్కులో ఇన్‌ఫెక్షన్ తో ఈ వ్యాధి మొదలవుతుంది. అక్కడి నుంచి ఇది కళ్లకు వ్యాపిస్తుంది. ప్రారంభ దశలోనే కనుక ఈ వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకుంటే దీని నుండి బయటపడవచ్చు. ఒకవేళ ఈ వ్యాధిని గుర్తించడంలో ఆలస్యమైనా లేక చికిత్స తీసుకోకుండా అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలుపోయే ప్రమాదముంది. ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిపై ఈ మ్యూకార్ మైకోసిస్ ఎక్కువ ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా కరోనా సోకని వారిలో “మ్యూకార్ మైకోసిస్” వ్యాప్తి చెందడానికి 15 నుంచి 30 రోజుల సమయం తీసుకుంటుందని, అయితే కరోనా రోగులకు మాత్రం ఇది 2 నుంచి 3 రోజుల్లోనే సోకుతోందని నిపుణులు తెలియచేస్తున్నారు. తాజాగా ఢిల్లీలో సర్ గంగారామ్ ఆస్పత్రిలో రెండు రోజుల క్రితం 12 మ్యుకోర్మికోసిస్ కేసులు నమోదయ్యాయి. ముంబైలోనూ పలువురు ఆస్పత్రుల్లో అడ్మిట్ అయ్యారు. ఇది ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధి నుండి కాపాడుకోవడం ఎలా.. ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రతను తప్పకుండా పాటించాలి. ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి. ముక్కును, కంటిని ఎటువంటి పరిస్థితుల్లోనూ చేతులతో తాకకుండా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ముక్కు, గొంతు, కళ్లు భాగాల్లో వాపు కనిపిస్తే వెంటనే అశ్రద్ధ చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే కనుక తేలికగా దీని నుండి బయటపడవచ్చు. నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రాణాలకే ప్రమాదం. కనుక ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండి మనల్ని మనం కాపాడుకుందాం.