నవోదయ విద్యాలయాల్లో దరఖాస్తులకు ఆహ్వానం

నవోదయ విద్యాలయాల్లో దరఖాస్తులకు ఆహ్వానంములుగుజిల్లా: ఈ నెల 15లోగా నవోదయ విద్యాలయాల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని వరంగల్ నవోదయ విద్యాలయం ప్రిన్సిపల్ బి.పూర్ణిమ పిలుపునిచ్చారు. నవోదయ విద్యాలయ, మామునూర్, వరంగల్ లో 6వ తరగతిలో అడ్మిషన్లు పొందుటకు ఈనెల 15 లోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర విద్యాశాఖ క్రింద స్వయం ప్రతిపత్తి గల సంస్థ నవోదయ విద్యాలయ సమితి అని, ఇందులో రెసిడెన్షియల్ వసతితో పాటు నాణ్యమైన విద్య అందించనున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. కో -ఎడ్యుకేషన్ వుండి, బాల బాలికలకు విడివిడిగా హాస్టల్ సదుపాయాలు వున్నాయన్నారు. జేఈఈ మెయిన్స్ , జేఈఈ అడ్వాన్స్ , నీట్ తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధంతో పాటు క్రీడలు, ఎన్ సీసీ , స్కౌట్ అండ్ గైడ్స్ , ఎన్ ఎస్ ఎస్ లో విద్యార్ధులకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ ఆమోదిత పాఠశాలల్లో 2020-21 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదివినవారు, మూడవ, నాల్గవ తరగతులు ఉత్తీర్ణత అయినవారు, 1 మే, 2008 నుండి 30 ఏప్రిల్ 2012 మధ్య పుట్టినవారు ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె తెలిపారు. 80 సీట్లకుగాను 75 శాతం గ్రామీణ పాఠశాలల పిల్లలకు, 1/3 వంతు బాలికలకు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు కేటాయింపులు వుంటాయని ఆమె స్పష్టం చేశారు. 10 ఏప్రిల్, 2021 (శనివారం)న ఎంపిక పరీక్ష నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ నెల 15 లోగా ఆన్లైన్ వెబ్ సైట్ www.navodaya.gov.in ద్వారా దరఖాస్తులు సమర్పించాలని ఆమె తెలిపారు. పిల్లలకు పూర్తి ఉచితంగా, నాణ్యమైన విద్య అందిస్తున్న ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ ఈ ప్రకటనలో పేర్కొన్నారు.