కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కై ఇక సమరమే : దాస్యం 

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కై ఇక సమరమే : దాస్యం

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కై ఇక సమరమే : దాస్యం వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : పార్లమెంట్ సాక్షిగా పొందుపరిచిన విభజన హామీలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అపహాస్యం చేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. తెలంగాణ పట్ల వివక్షత బీజేపీ డీఎన్ ఏ లోనే ఉందని దాస్యం ఎద్దేవా చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయమని తెగేసి లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వడంపై దాస్యం వినయ్ భాస్కర్ మండిపడ్డారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తాయి. కాజీపేట చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరును ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కై ఇక సమరమే : దాస్యం దశాబ్దాల నుండి నాడు కాంగ్రెస్ ప్రభుత్వం, నేడు బీజేపీ ప్రభుత్వం కాజీపేట ప్రజల కలను కలగానే మిగిల్చిందని ఆయన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలపై చీఫ్ విప్ మండిపడ్డారు. రాజ్యసభలో కేంద్ర మంత్రి తెలంగాణలో కోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదని లిఖిత పూర్వక సమాధానం ఇస్తే, స్థానిక బీజేపీ నాయకులేమో రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించడం లేదని అసత్య ప్రచారం చేయడం సిగ్గుచేటని అన్నారు. బీజేపీ బహిర్గతం చేసిన ద్వంద్వ, దొంగ వైఖరి తెలంగాణ ప్రజలకు తెలుసని స్థానిక బీజేపీ నాయకులకు చురకలు అంటించారు.

అభివృద్ధి, సంక్షేమం అని మేమంటుంటే బీజేపీ పార్టీయేమో అల్లర్లు, గొడవలు, చిచ్చులను సృష్టించాలని చూడడం అత్యంత దౌర్భాగ్యమైన చర్య అని ధ్వజమెత్తారు. నై తెలంగాణ, నో తెలంగాణ అన్నోళ్లతోనే జై తెలంగాణ అనిపించిన మా తెలంగాణ ప్రజలతో మమేకమై.. మా విభజన హక్కులను పొందేందుకు , అలాగే మా ప్రాంతానికి లబ్ధిని చేకూర్చే కోచ్ పరిశ్రమ విషయంలో కేంద్రంపై దశల వారిగా పోరాటం ఉధృతం చేస్తామని చీఫ్ విప్ హెచ్చరించారు.

అనంతరం కాజీపేట ప్రాంత ప్రయోజనమైన కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం మేము సైతం అంటూ పలువురు యువకులు బీఆర్ఎస్ లో చేరగా వారికి దాస్యం వినయ్ భాస్కర్ పార్టీ కండువా కప్పి స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ సుందర్ రాజు యాదవ్, మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నార్లగిరి రమేష్, కాజీపేట రైల్వే కోచ్ సాధన సమితి నుండి పలువురు సభ్యులు, పలువురు కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.