గూడ్స్ రైలు ఢీకొని కూలి మృతి

హైదరాబాద్: పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు ఢీకొని ఓ కూలి మృతి చెందాడు. ఈ ఘటన నగరంలోని కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఘటనా స్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ రైల్వే పోలీసులు తెలిపారు. అయితే యాకత్ పుర_ఉప్పుగూడ రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలు దాటుతుండగా అదే సమయంలో ఎదురుగా వచ్చిన గూడ్స్ రైలు ఢీకొనడంతో లక్ష్మణ్ అక్కడికక్కడే మృతి చెందాడని కాచిగూడ రైల్వే హెడ్ కానిస్టేబుల్ బీజీ ప్రసాద్ రావు తెలిపారు. మృతుడు పి. లక్ష్మణ్ ఉప్పుగూడ, హనుమాన్ నగర్ కు చెందిన రాములు కుమారుడుగా పోలీసులు గుర్తించారు. మృతుడు పి. లక్ష్మణ్ వృత్తి రీత్యా కూలీ పని చేసుకునేవాడని తెలిపారు.