మరోసారి వివాదంలో చిక్కిన మంగ్లీ
వరంగల్ టైమ్స్, శ్రీకాళహస్తి : సింగర్ మంగ్లీ శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఓ పాటను చిత్రీకరించడం దుమారం రేపుతోంది. గత 20 యేళ్లుగా శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో వీడియో చిత్రీకరణకు అనుమతి లేదు. అయితే ఆలయంలో మంగ్లీ పాటను చిత్రీకరించడం ఎలా సాధ్యమైందని, అనుమతి ఎలా వచ్చిందంటూ తీవ్ర విమర్శలకు దారితీసింది.
ప్రతీ యేడాది మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మంగ్లీ ఓ ప్రైవేట్ సాంగ్ ను రికార్డు చేసి విడుదల చేస్తుంటారు. అందులో భాగంగానే ఈ యేడాది ఆమె శ్రీ కాళహస్తీశ్వరాలయంలో ‘భం భం భోలే’ పాటను షూట్ చేశారు. ఇక్కడి కాలభైరవ స్వామి ఆలయం, అమ్మవారి సన్నిధి, స్ఫటిక లింగం, రాహుకేతు మంటపం, రాయల మంటపం, ఊంజల్ సేవా మంటపం వద్ద ఈ పాట చిత్రీకరణ జరిపినట్లు తెలుస్తోంది.
అయితే ఆలయంలో షూటింగ్ జరిపేందుకు మంగ్లీకి అనుమతులు ఎలా లభించాయన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ పాట యూట్యూట్ లోనూ, సోషల్ మీడియా వేదికల్లోనూ దర్శనమిస్తోంది.