భావోద్వేగానికి గురైన నాగబాబు

భావోద్వేగానికి గురైన నాగబాబుహైదరాబాద్‌: మరో రెండు రోజుల్లో కొణిదెల నిహారిక వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. దీంతో ఇప్పటికే మెగా వారి ఇంట్లో పెళ్లి సందడి మొదలయ్యింది. మరికొద్ది గంటల్లో తన కుమార్తె మరొక ఇంటికి కోడలుగా అడుగుపెట్టనున్న తరుణంలో నాగబాబు భావోద్వేగానికి గురయ్యారు. నిహారికను పెళ్లికుమార్తెగా అలంకరించిన సమయంలో తన అన్నావదినలతో కలిసి దిగిన ఓ ఫొటోని ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేస్తూ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. ‘కుటుంబంగా నీకు మూలాలు అందించాం. నువ్వు ఎగరడానికి కావాల్సిన రెక్కలు తండ్రిగా ఇచ్చాను. ఆ రెక్కలు నిన్ను మరింత ఎత్తుకు తీసుకువెళ్తాయి. అలాగే ఆ మూలాలు నిన్ను ఎప్పుడూ సంరక్షిస్తూనే ఉంటాయి. నిన్ను ప్రేమించే తండ్రిగా నీకు అందించే రెండు అద్భుతమైన బహుమతులివే. లవ్‌ యూ నిహారిక’అని నాగబాబు పోస్ట్‌ పెట్టారు. గుంటూరు మాజీ ఐజీ ప్రభాకర్‌రావు కుమారుడు చైతన్యతో నిహారిక వివాహం జరగనుంది. డిసెంబర్‌ 9న జరగనున్న వీరి వివాహానికి ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌విలాస్‌ హోటల్‌ వేదిక కానుంది. దీంతో తాజాగా ఇరు కుటుంబాల్లో పెళ్లి పనులు ఘనంగా జరుగుతున్నాయి.