ముంబైలోనూ చేస్తాం: సంజయ్ దత్

ముంబైలోనూ చేస్తాం: సంజయ్ దత్హైదరాబాద్: ప్రకృతి పట్ల ప్రేమ కనబరుస్తూ, పర్యావరణ రక్షణపై అందరిలో అవగాహన పెరగాలని ఆకాంక్షించారు ప్రముఖ బాలీవుడ్ హీర్ సంజయ్ దత్. ప్రస్తుతం ప్రపంచం ముందు ఉన్న సవాళ్లలో పర్యావరణ రక్షణే అతి పెద్దదని, ఈ ముప్పు నుంచి బయటపడాలంటే, ఉన్న అడవులను కాపాడు కోవటంతో పాటు, కొత్తగా పెద్ద ఎత్తున పచ్చదనం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా సంజయ్ దత్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

 

ఎంపీ సంతోష్ తో కలిసి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని హైదరాబాద్ శిల్పారామంలో మొక్కలు నాటారు. సంతోష్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి తాను గతంలోనే విన్నానని, దేశ వ్యాప్తంగా పచ్చదనం పెంపు దిశగా ఆదర్శవంత కార్యక్రమం అని సంజయ్ దత్ మెచ్చుకున్నారు. ఇప్పుడు సంతోష్ పుట్టిన రోజు సందర్భంగా, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటడం తనకు సంతోషాన్ని ఇచ్చిందన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను నా అభిమానులు, సన్నిహితులతో ముంబైలోనూ చేస్తామని సంజయ్ దత్ తెలిపారు. పర్యావరణ కాలుష్యం తగ్గించేందుకు, పచ్చదనం పెంచేందుకు మొక్కలు నాటడం, పెంచడాన్ని ప్రతీ ఒక్కరూ తమ జీవన విధానంలో భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా సంజయ్ దత్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మొక్కలు నాటిన ప్రతీ ఒక్కరికీ ఎంపీ సంతోష్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ప్రతీ ఒక్కరూ తాము నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత తీసుకోవటంతో పాటు, మరో ముగ్గురితో నాటించి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చైన్ కొనసాగిస్తూ, దేశ వ్యాప్తంగా మొక్కలు నాటే సంస్కృతి పెరిగేలా చూడాలని కోరారు.