నత్తనడకన వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు

నత్తనడకన వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లుహైదరాబాద్: తెలంగాణలో మూడు నెలల విరామం అనంతరం డిసెంబర్ 14న ప్రారంభమైన వ్యవసాయేతర ఆస్తుల, భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వినియోగదారులకు తలనొప్పిగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా స్లాట్ బుక్ చేసుకోవడం, ఆస్తులకు సంబంధించిన గుర్తింపు సంఖ్య తప్పనిసరి కావడంతో పాటు వెబ్ సైట్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మొదటి రోజు పెద్దగా రిజిస్ట్రేషన్లు జరుగలేదు. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్లకు సంబంధించి తలెత్తుతున్న సమస్యలు, తదితర అంశాలపై అధికారులు, బిల్డర్లు, స్థిరాస్తి వ్యాపారులు, ఇతర వర్గాల నుంచి బేదాభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఇప్పటికే లక్షల్లో ఎల్ ఆర్ ఎస్ రిజిస్ట్రేషన్లు పెండింగ్ లో వున్న నేపథ్యంలో ఎల్ ఆర్ఎస్ లేని వారు తమ ఆస్తులకు రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు అనర్హులని అధికారులు చెబుతుండటంతో నిరాశ చెందిన వినియోగదారులు ఆందోళనకు దిగుతున్నారు. 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ , మ్యుటేషన్ ప్రక్రియ జరగాలన్న కాన్సెప్ట్ తో పాటు పలు టెక్నికల్ సమస్యలు తలెత్తుతుండటంతో రిజిస్ట్రేషన్ల కోసం ఆఫీసుల్లో వినియోగదారులు పడిగాపులుగాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక PTIN తప్పని సరి కావడంతో స్లాట్ బుకింగ్ కావడం లేదు. ప్రాపర్టీ ట్యాక్స్ పే చేయడం, ఓపెన్ ప్లాట్లకు ఎల్ ఆర్ ఎస్ తప్పనిసరి కావడంతో వినియోగదారులు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే నత్తనడకన సాగుతున్న వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పాత పద్దతి కొనసాగాలని డిమాండ్ చేస్తున్నారు.