ఏపీ జనసేన ముఖ్యనేతలతో పవన్ కీలక భేటీ
వరంగల్ టైమ్స్, అమరావతి : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో అధికారమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. మొన్నటి వరకు వారాహి యాత్రల పేరిట నియోజకవర్గాల వారీగా పర్యటించారు. అయితే ప్రస్తుతం పర్యటనలకు కాస్త బ్రేక్ ఇచ్చి పార్టీ ముఖ్యనేతలతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులకు టికెట్ కేటాయింపులపై చర్చలు జరుపుతున్నారు. ఈ భేటీలో భాగంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు పవన్. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులకు టికెట్లు కేటాయించినట్లు ఈసారి కేటాయించమని తేల్చి చెప్పేశారు. గతంలో ఉదాసీనంగా వ్యవహరించామని ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. టికెట్లు ఆశించే అభ్యర్థి వ్యక్తిగతంగా 10 నుంచి 15 వేల ఓట్లు తెచ్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండాలని చెప్పారు. అలా ప్రజల్లో ఆదరణ ఉన్న వారికి మాత్రమే టికెట్లు కేటాయించడం జరుగుతుందని తెలిపారు.
గతంలో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే టీడీపీ నేతలతో సఖ్యతతో మెలగాలని దిశానిర్థేశం చేశారు. టీడీపీ పార్టీతో సయోధ్యతో ప్రయాణం చేసిన వారికి తొలి ప్రాధాన్యత ఇస్తానన్నారు. తాను జోరో బడ్జెట్ పాలిటిక్స్‌ని ప్రోత్సహిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. అది నిజం కాదన్నారు. దీనికి గల కారణాన్ని కూడా వివరించారు. ఎన్నికల కమిషన్ 40 లక్షల వరకు ఖర్చు చేసే అవకాశం ఇస్తుంటే.. తాను జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఎలా చేస్తానని ముఖ్యనేతలతో చర్చించారు. అయితే మన్నటి వరకూ యాత్రలు, నిరసన కార్యక్రమాలతో గడిపిన పవన్ ప్రస్తుతం క్యాడర్‌ను నిర్మించుకునే పనిలో కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.