రికార్డు బ్రేక్ చేసిన హబుల్ టెలిస్కోప్
వరంగల్ టైమ్స్ , టెక్సాస్ : హబుల్ టెలిస్కోప్ రికార్డు బ్రేక్ చేసింది. రోదసిలో అత్యంత సుదూరంలో ఉన్న కొత్త నక్షత్రాన్ని కనుగొన్నది. 12.9 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఆ నక్షత్రం ఉన్నట్లు గుర్తించారు. అంటే ఆ నక్షత్రం నుంచి భూమికి వెలుతురు చేరేందుకు 12.9 బిలియన్ సంవత్సరాలు పడుతుందని నాసా తెలిపింది. “ఎరండాల్” అని దానికి పేరు పెట్టారు. ఎరండాల్ అంటే మార్నింగ్ స్టార్ అన్న అర్థం వస్తుందని నాసా పేర్కొన్నది. గతంలో 2018 లోనే హబుల్ ఓ కొత్త నక్షత్రాన్ని కనుగొన్నది. ఆ నక్షత్రం 9 బిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అయితే ఆ రికార్డును ఇప్పుడు హబుల్ బ్రేక్ చేసినట్లు నాసా వెల్లడించింది. ఆ కొత్త నక్షత్ర పరిశోధనకు సంబంధించిన పత్రాలను నేచర్ పత్రికలో ప్రచురించారు. సూర్యుడి కన్నా 50 రెట్లు అధిక ప్రమాణంతో ఉంటుందని పరిశోధకులు అంచనా వేశారు. లక్షల సంఖ్యలో ఆ నక్షత్రం సూర్యుడి కన్నా ఎక్కువ తేజస్సుతో వెలిగిపోతుందన్నారు. WHLO137-08 గెలాక్సీలో ఆ నక్షత్రం ఉందని, దాన్ని ఇంకా లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. ఎరండాల్ నక్షత్రాన్ని జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తో స్టడీ చేయనున్నట్లు నాసా పేర్కొంది.